30, నవంబర్ 2019, శనివారం

Priyanak Reddy Rape, Murder: ప్రియాంకా రెడ్డి చివరి ఫోన్ కాల్ ఇదే.. మొత్తం వినండి


హైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్యకు గురయిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి చనిపోవడానికి ముందు తన చెల్లెలుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణ విన్న ప్రతి ఒక్కరి మనసు చలిస్తోంది. ఈ సంభాషణలు మొత్తం ఇవీ..

ప్రియాంకారెడ్డి: పోయావా పాపా ఆఫీస్‌కి.
చెల్లెలు: హా.
ప్రియాంకారెడ్డి: నాదిప్పుడు అయిపోయింది. వచ్చినా ఇప్పుడు.
చెల్లెలు: హా.
ప్రియాంకారెడ్డి: మాట్లాడు.. కొంచెం సేపు మాట్లాడు.
చెల్లెలు: ఏమైందే.
ప్రియాంకారెడ్డి :మాట్లాడు పాపా నీకు తర్వాత చెప్తా.
చెల్లెలు: యాక్సిడెంట్ అయిందా? చెప్పు.
ప్రియాంకారెడ్డి :నాకు చాలా టెన్షన్ గా ఉందే.
చెల్లెలు: యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంకారెడ్డి : అక్కడ ఎప్పుడూ బైక్ పెట్టి పోతానని చెప్పినా కదా. ఆ రోజు అక్కడ పెట్టిన, నిలబడ్డ. టోల్ కలెక్ట్ చేసేటాయన పిలిచి ఇక్కడ బైక్ పెట్టకండి మేడమ్, ఇంతకు ముందే పోలీసువాళ్లు తీసుకొనిపోయిన్రు అంటే.. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఇంకొక దారి ఉంటుంది కదా, అక్కడ పెట్టాను. ఇప్పుడు దిగి వచ్చాను పాపా ఇక్కడికి. స్కూటీ పంక్చర్ అయింది.
చెల్లెలు : మరి వదిలేసి రా. ఇంకేంటి?
ప్రియాంకారెడ్డి : వదిలేస్తే ఎట్ల, మల్ల పొద్దున ఎవరు తీసుకొస్తరే?
చెల్లెలు : ఇంక రేపొద్దున్న ఎవరినైనా తీసుకెళ్లి చేయించి తీసుకురావాలి.
ప్రియాంకారెడ్డి : ఎవర్ని తీసుకెళ్లాలి?
చెల్లెలు: మెకానిక్‌ని.
ప్రియాంకారెడ్డి : మెకానిక్ నా?
చెల్లెలు : అవును మెకానిక్‌ని. కొంచెం దూరం కూడా పోదానె పంక్చర్ అయితే? చూడాలి వస్తందేమో.
ప్రియాంకారెడ్డి : వెనకాల టైర్.
చెల్లెలు : నాకు తెలీదు కదా.
ప్రియాంకారెడ్డి : అయితే.. చెప్తా విను. ఇక్కడొక లారీ ఉందే. అందులో జనాలు ఉన్నారు. అందులో ఒకాయన నేను చేయించుకొస్తా అని తీసుకొని పోయిండు స్కూటీ.
చెల్లెలు : తీసుకురాలేదా మళ్లీ స్కూటీ?
ప్రియాంకారెడ్డి : తీసుకొచ్చిండు. క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చింది. మళ్లీ ఇంకో షాప్‌కు పోయి చేయించుకొస్తా అని తీసుకెళ్లిండు. భయం అయితాంది పాపా నాకు.
చెల్లెలు : ఎవరూ లేరా అక్కడ?
ప్రియాంకారెడ్డి : వెహికల్స్ ఉన్నాయి. టోల్ ఉంటాది చూడూ.. ఆడ. నేను వెళ్తా అంటే వద్దు నేనే వెళ్తా అని దెయ్యంలా వెంట పడిండు. వద్దు మధ్యలో ఆగిపోతోంది అన్నాడు. నాకు భయం అయితాంది పాపా.
చెల్లెలు : ఎందుకు? ఏమైతుంది? ఉండు అక్కడ, టోల్ గేట్ దగ్గర.
ప్రియాంకారెడ్డి :వాళ్లు బయటనే నిలబడిండ్రు.
చెల్లెలు : ఎవరు?
ప్రియాంకారెడ్డి : లారీస్ వాళ్లు.
చెల్లెలు : నువ్వు, టోల్ గేట్ ఉంటుంది కదా.. అక్కడికి వెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : అక్కడకా? నువ్వు మాట్లాడు పాపా.. భయం అయితాంది.
చెల్లెలు: టోల్ ప్లాజా దగ్గర ఇస్తారు కదా టికెట్లు.. అక్కడికెళ్లు, అక్కడికెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : వీళ్లేంటే.. సడెన్‌గా ఎవరూ కనిపస్తలేరు. దెయ్యాల్లా ఈడనే ఉన్నరు అంతసేపు.
కనిపించిన్రులే. నేను పోతున్నా పాపా.. ఎక్కి స్టార్ట్ చేసిన. కిందికొచ్చి.. మేడమ్ మేడమ్ టైర్ పంక్చర్ అయిందని. బస్టాండ్ వరకూ వెళ్లదా.. బస్టాండ్ దగ్గర షాప్ ఉంటదే, అక్కడ చేయించుకుంటా అంటే, లేదు మేడమ్ వద్దు మేడమ్ నేను చేయించుకొస్తా అని ఎవడో ఒక పిలగాడ్ని పంపించిండు. ఆ దెయ్యం పిలగాడు పోయిండు. ఉత్తగ వచ్చిండు. సర్లేండి మళ్లీ ఎక్కడో ఇంకొక షాప్ ఉందని చెప్పిండు. ఇంక లేట్ అవుతోంది నేను వెళ్తా అంటే.. లేదు మేడమ్, మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. కష్టం అవుతుందని దయ్యాల్లాగా నా వెంట పడిండ్రే.
చెల్లెలు : నిజంగానే సడెన్‌గా మధ్యలో ఆగిపోతే అప్పుడేం చేస్తావ్?
ప్రియాంకారెడ్డి : నాకు ఇక్కడ చాలా భయం అయితాంది.
చెల్లెలు : టోల్ గేట్ దగ్గరకు వెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : ఆ టోల్ బూత్ దగ్గర ఏం నిలబడాలే. అందరూ నన్నే చూస్తారు. ఆడ నిలబడితే.
చెల్లెలు : చూస్తే చూడనీ.. కాస్త జనాలైనా ఉంటారు కదా ఆడ.
ప్రియాంకారెడ్డి: చాలా భయం అవుతోంది వాల్లను చూస్తుంటే. ఏడుపొస్తోందే..
భయం అయితాంది పాపా. ఇంకా తీస్కరాలేదే.. దెయ్యం ముసుగోడు.
చెల్లెలు : తీసుకొస్తడు లే.
ప్రియాంకారెడ్డి: నాకు వాళ్లను చూస్తుంటే చాలా భయంగా ఉందే.. ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు.
చెల్లెలు : సరే కొంచెంసేపైన తర్వాత మళ్లీ చేస్తా.
ప్రియాంకారెడ్డి: (ఏడుస్తూ..) ప్లీజ్ పాపా..
చెల్లెలు: సరే కొంచెంసేపైన తర్వాత చేస్తా.

షాద్ నగర్ అత్యాచారం-హత్య: PriyankaReddy ని అత్యాచారం చేసి ఎవరు చంపారు? ఎందుకు చంపారు?

ప్రియాంకారెడ్డి(Priyanka Reddy) ఒక వెటర్నరీ డాక్టర్. బుధవార రాత్రి ఆమెను హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ వద్ద నలుగురు యువకులు మహమ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌లు దారుణంగా సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం శవాన్ని గురువారం వేకువజామున ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చింతపల్లి గ్రామం సమీపంలో పెట్రోలు పోసి కాల్చేశారు.

నిందితులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అత్యాచారం, హత్యకు గురయిన ప్రియాంక రెడ్డి పశు వైద్యురాలు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె సొంతూరు. ఈ కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది. ప్రియాంక రెడ్డి బుధవారం సాయంత్రం గచ్చిబౌలి వెళ్ళారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్ దగ్గర తొండుపల్లి టోల్ ప్లాజాకి కాస్త దూరంలో బండి పెట్టి అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి ప్లాజా దగ్గరకు వచ్చారు.
అప్పుడు ఆమె బండి పంక్చర్ అయిందని అక్కడున్న లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేసే నలుగురు నిందితులు ఆమెతో చెప్పారు. పంక్చర్ వేయించుకుని వస్తామని బండి తీసుకెళ్లి ఆమెను అక్కడ వెయిట్ చేసేలా చేశారు. అంతలోనే ఆమెను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు.
నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడానికి ముందే ఆమె వారి తీరును అనుమానించి భయంతో తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది. చెల్లెలు ఆమెను టోల్ ప్లాజా వద్దకు వచ్చి వెయిట్ చేయమని చెప్పింది. అయితే, తిరిగి రాత్రి 9.44 ప్రాంతంలో సోదరి మళ్లీ కాల్ చేయగా, ఫోన్ స్విచాఫ్‌ అయి ఉంది. అప్పుడు కుటుంబ సభ్యులు టోల్ ప్లాజాకు వెళ్లారు. రాత్రంతా వెతికి అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేసు నమోదయింది. గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ దగ్గర్లో స్థానికులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం అక్కడకు చేరిన బంధువులు, గొలుసు, చున్నీ ఆధారంగా ఆ మృతదేహం డాక్టర్‌దేనని గుర్తించారు. పోలీసులు అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
బాధితురాలు తన సోదరికి చెప్పిన కథనం ప్రకారం, ఒక లారీ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చి మీ బండి పంక్చర్ అయిందనీ, తాను బాగు చేయిస్తాననీ అన్నాడు. అవసరంలేదు తానే పంక్చర్ షాపుకు వెళ్తానన్నప్పటికీ తాను సాయం చేస్తానంటూ తీసుకెళ్లాడు. దీంతో అతనికి దూరంగా టోల్ ప్లాజా దగ్గర నిలబడమని బాధితురాలికి సోదరి సూచించగా, ఆమె నిరాకరించారు. అందరూ చూస్తారని భయపడింది. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయింది.
ఉదయం ఏడు గంటలకు షాద్ నగర్ పోలీసులకు మృతదేహం గురించి సమాచారం వచ్చింది. పోల్చి చూడగా అది రాత్రి మిస్ అయిన కేసుకు సంబంధించినదే అని తేలింది.

23, నవంబర్ 2019, శనివారం

అజిత్ పవార్: శరద్ పవార్‌కు ఏమవుతారు? రాజకీయంగా ఎలా ఎదిగారు?

అజిత్ పవార్

అజిత్ పవార్(Ajit pawar).. మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharashtra Politics) ట్రంప్ కార్డు వేసిన ఈ నాయకుడి పేరు అందరి నోళ్లలో నానుతోంది. శివసేన(Shivsena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్(Congress)లకు షాకిస్తూ బీజేపీని అధికారంపీఠంపై కూర్చోబెట్టిన నేత అజిత్ పవార్. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి, బీజేపీకి మద్దతు ప్రకటించి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని ట్విస్ట్ ఇచ్చిన నాయకుడు. శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణం చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్న కుమారుడే అజిత్ పవార్. గోవిందరావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ స్టూడియోస్'లో అనంతరావ్ పవార్ పని చేసేవారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ పదో తరగతి తరువాత తండ్రి చనిపోవడంతో విద్యాభ్యాసాన్ని వదిలేసి, తన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ ఓ బలమైన నేతగా ఎదిగారు. మరోవైపు, తన చదువును కొనసాగించడానికి పుణె జిల్లా నుంచి అజిత్ పవార్ ముంబైకి మకాం మార్చారు. 1982లో అజిత్ పవార్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎన్నికై... అదే పదవిలో ఏకంగా 16 సంవత్సరాలు కొనసాగారు.
అనంతరం  బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తన చిన్నాన్న శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన శరద్ పవార్ పీవీ నరసింహారావు కేబినెట్ లో రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ గెలుపొందారు. ఇదే స్థానం నుంచి వరుసగా 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. పృథ్విరాజ్ చవాన్ సీఎంగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పదంసిన్హ్ పాటిల్ కుమార్తె సునేత్రను అజిత్ పవార్ పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.

దేవేంద్ర ఫడణవీస్: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ఆయనే.. అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి

దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్


దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis), అజిత్ పవార్, మహారాష్ట్ర, Devendra Fadnavis, Ajit Pawar, Maharashtra, దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన

మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. బీజేపీ, ఎన్సీపీ కూటమిగా అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ రాజకీయాల ముందు శివసేన నిలవలేకపోవడంతో కొన్నివారాలుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు దొరుకుతూ దేవేంద్ర ఫడణవీస్ మరోసారి ముఖ్యమంత్రయ్యారు. శనివారం ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ ఖోశ్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఇస్తామని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఫడణవీస్ చెప్పారు. ఫడణవీస్, అజిత్ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర భవిష్యత్ కోసం వారు పాటుపడతారని మోదీ పేర్కొన్నారు.

22, నవంబర్ 2019, శుక్రవారం

George Reddy జార్జి రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?


జార్జి రెడ్డి(George Reddy)... ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)లో 47 ఏళ్ల కిందట హత్యకు గురయిన విద్యార్థి నేత. ఆయన జీవితం నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా తెలుగునాట ఆయన చుట్టూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన విద్యార్థులు, అణగారిన వర్గాల సమస్యల కోసం పోరాడిన నాయకుడంటూ కొందరు.. కాదు కాదు, ఆయనో రౌడీ అంటూ మరికొందరు వాదిస్తున్నారు. జార్జిరెడ్డి అందరిపై దౌర్జన్యాలు చేసేవాడని.. బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగరరావును ఆయన అప్పట్లో కొట్టాడన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆయన్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు.. ఎలా చంపారు? నిందితులు ఎలా విడుదలయ్యారనే విషయాల్లో ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికగా అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. ఆయన్ను భగత్ సింగ్, చేగువేరాలతో పోల్చుతూ పాత అభిమానులతో పాటు కొత్త అభిమానులు పుట్టుకొస్తుంటే ఆయన్ను విమర్శించేవారూ ఎక్కువయ్యారు.
ఇదే సమయంలో జార్జి రెడ్డి పేరే కులాన్ని సూచిస్తున్నప్పటికీ ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జార్జి రెడ్డి కులం, ఊరు, తల్లిదండ్రులు, జన్మదినం, భార్య పేరు, లవ్ ఎఫైర్స్ ఉన్నాయా అంటూ గూగుల్‌ను ప్రశ్నించి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిలో కొన్నిటికి సమాధానమే ఈ ఆర్టికల్.
జార్జిరెడ్డి జన్మదినం: భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరమైన 1947లో సంక్రాంతి రోజున(జనవరి 15న) జార్జి రెడ్డి జన్మించారు.
జార్జి రెడ్డి తల్లిదండ్రులు: చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్. తల్లి లీలా వర్గీస్‌ది కేరళ రాష్ట్రం పాల్ఘాట్. తండ్రిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా.
జార్జి రెడ్డి భార్య: జార్జి రెడ్డి అవివాహితుడు. 25 ఏళ్ల వయసులోనే హత్యకు గురయ్యాడు.
జార్జి రెడ్డి ప్రేమ కథ: జార్జి రెడ్డి ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా పోరాడారని సమకాలీకులు చెబుతారు. ఆయన స్త్రీలను గౌరవించేవారని, ఎవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని చెబుతారు.
జార్జి రెడ్డి మరణం: జార్జి రెడ్డి 1972, ఏప్రిల్ 14న ఉస్మానియా క్యాంప‌స్‌లో హత్యకు గురయ్యారు.

బొలీవియా సంక్షోభం అమెరికా పనేనా?

బొలీవియా, ఇవో మొరేల్స్, ఇవో మొరాలెస్ bolivia, evo morales

ఎక్కడ విలువైన ఖనిజ, చమురు నిక్షేపాలుంటాయో.. అక్కడ అమెరికా తమ డేగ రెక్కలతో వాలిపోతుంది. ఆ దేశ రాజ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తమకనుకూల వ్యక్తులను అధికారంలో ప్రతిష్ఠిస్తుంది. ఇప్పుడు బొలీవియాలోనూ అదే జరుగుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాశ్రేయస్సుకు పెద్దపీట వేసి, సామాజిక రాజకీయ మార్పుల కోసం కృషిచేస్తున్న మూలవాసుల నాయకుడు, దేశాధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ను పదవీచ్యుతుడ్ని చేసింది. సైనిక తిరుగుబాటుకు అమెరికా అన్నివిధాలా దన్నుగా నిలిచింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యం ఇచ్చే సైనిక పాలనలోకి బొలీవియా వెళ్లింది. మొరేల్స్‌ మెక్సికోలో తలదాచుకోవాల్సిన విషాదకర పరిస్థితి తలెత్తింది.
సైనిక పాలనకు వ్యతిరేకంగా బొలీవియా కార్మికులు, రైతులు, గిరిజనులు పెద్ద పోరాటమే చేశారు. రాజధాని లాపాజ్‌లోనూ, కార్మికవర్గం బలంగా ఉన్న ఎల్‌ ఆల్టోలోను సైన్యంతో తలపడుతూనే ఉన్నారు. కోచమ్‌బాంబాలో సైన్యం జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని సైన్యం దాడులకు పాల్పడింది. అక్టోబరు 20న జరిగిన అధ్యక్ష ఎన్నికను వివాదాస్పదం చేస్తూ మూడువారాల పాటు జరిగిన నిరసన ప్రదర్శనలు అంతిమంగా ఈ నెల 17న సైనిక తిరుగుబాటుకు దారితీశాయి. మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆనందానికి అవధుల్లేవు. ఇక వెనిజులా, నికరాగ్వా నాయకులకు కూడా ఇదే గతి పడుతుందనేలా మాట్లాడారు.
లాటిన్‌ అమెరికాలో తన సామ్రాజ్యవాద విధానాన్ని అమెరికా కొనసాగిస్తున్నదన్న వాస్తవాన్ని బొలీవియా సైనిక తిరుగుబాటు ప్రతిబింబిస్తోంది. 2002లో బుష్‌ నేతృత్వంలో వెనిజులాలో హుగో చావెజ్‌ మీద విఫల సైనిక కుట్ర నుంచి 2009లో ఒబామా మద్దతుతో హౌండురాస్‌లో మాన్యుయెల్‌ జెలాయా ప్రభుత్వాన్ని కూలదోయటం దాకా, నేడు బొలీవియా ఘటనతో లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై క్షీణిస్తున్న అమెరికా పెత్తనాన్ని తిరిగి నెలకొల్పేందుకు అమెరికా తన సామ్రాజ్యవాద విధానాన్ని సొంత పెరడు లాటిన్‌ అమెరికాలో సైనిక హింసతో కొనసాగిస్తున్నది.
బొలీవియాలో అపార ఇంధన, ఖనిజ వనరులున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో 70శాతం లిథియం ఇక్కడే ఉంది. ఇప్పటికే పొరుగున ఉన్న అర్జెంటీనా, చిలీ దేశాల్లో లిథియం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొలీవియాలో మాత్రం ప్రభుత్వరంగ సంస్థతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తవ్వకాలు సాగించాలని మొరేల్స్‌ పట్టుబట్టారు. ఆయన పలు కార్పొరేటు కంపెనీలను దేశం నుంచి బయటకు పంపించారు. దీంతో పశ్చిమాసియా మాదిరిగా ఈ ప్రాంతాన్ని గుప్పెట పెట్టుకోవాలన్న దురాశతోనే బొలీవియాలో అమెరికా సైనిక తిరుగుబాటును ప్రోత్సహించింది.
చైనాతో లాటిన్‌ అమెరికా వాణిజ్యం నిరుడు రూ.21,42,000కోట్లకు చేరుకోవడం కూడా అమెరికాకు కంటగింపుగా మారింది. మొరేల్స్‌.. లాటిన్‌ అమెరికా దేశాలలోనే మొదటి భూమిపుత్ర నాయకుడు. స్థానిక తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన నేత. 1998లో లాటిన్‌ అమెరికాలో హుగో చావెజ్‌తో మొదలైన బొలీవరియన్‌ విప్లవ క్రమంలో భాగంగా మొరేల్స్‌ ప్రభుత్వం ఏర్పడింది. 2000-05 మధ్యకాలంలో నీటిని ప్రైవేటీకరిం చడానికి వ్యతిరేకంగా, గ్యాస్‌ని జాతీయీకరించాలని జరిగిన ప్రజా ఉద్యమాలతో మొరేల్స్‌కు ముఖ్య భూమిక ఉంది. తద్వారా ఆయన అధ్యక్షుడయ్యారు. ఆయన గిరిజనుల నుంచి ఎన్నికైన తొలి అధ్యక్షుడు. ఆయన హయాంలో పేదరికం 45నుంచి 25శాతానికి తగ్గిపోయింది. అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. గనులనూ, వనరులనూ ప్రభుత్వరంగంలోకి తెచ్చి, విద్యనూ వైద్యాన్నీ సార్వత్రికం చేశారు. సహజవాయువును జాతీయం చేయగా సమకూరిన సొమ్మును దారిద్య్రనిర్మూలనకు ఉపయోగించారు. రానున్న విద్యుత్‌ బ్యాటరీల యుగంలో అత్యంత కీలకమైన లిథియం వనరును కార్పొరేట్‌ కంపెనీలు తన్నుకుపోడానికి ఆయన అనుమతించలేదు. కార్మికోద్యమ నేతగా, మూలవాసుల నాయకుడిగా, ప్రజాసంక్షేమ సారథిగా దశాబ్దంన్నరపాటు దేశాన్ని ఏలిన మొరేల్స్‌ తన పాలనలో దేశాన్ని సామాజిక, ఆర్థికాభివృద్ధికి మంచి నమూనాగా తీర్చిదిద్దాడు. గ్రామీణ పేదలు, కార్మికులు, భూమిపుత్రులు మొరేల్స్‌ విధానాలకు మద్దతుగా నిలిచారు. పట్టణ ప్రాంతాలలోని ఉన్నతవర్గం, శ్వేతజాతీయులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారారు. వీరికి విదేశీ కార్పొరేట్‌ సంస్థల వెన్నుదన్ను ఉంది. లాటిన్‌ అమెరికా దేశాలలో వనరులపై కన్నేసిన అమెరికా-యూరోపియన్‌ కంపెనీలే ఇక్కడ సంక్షోభాన్ని పెంచి పెద్దచేయడంలో కీలక పాత్ర వహించాయి. దాదాపు దశాబ్దంన్నరగా బొలీవియాను పాలిస్తున్న మొరేల్స్‌ అక్టోబరులో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఉన్నతవర్గాలకు చెందిన ప్రతిపక్షం గోలపెట్టింది. అంతర్జాతీయ బృందాలు దీనికి వంతపాడాయి. తిరిగి ఎన్నికలు జరిపించడానికి తాను సిద్ధమేనని మొరేల్స్‌ ప్రకటించినా.. మొరేల్స్‌ పోటీ చేయకూడదంటూ షరతు పెట్టడంతో ఆయన అంగీకరించలేదు. దీన్ని సాకుగా చేసుకొని సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారు. చిలీ ప్రజలు ఏ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారో వాటినే బొలీవియాపై రుద్దేందుకు ఈ సైనిక కుట్ర జరిగింది. చిలీలో అలెండీ ఏ విధానాలను అమలు చేసినందుకు అమెరికా హత్య చేయించిందో, అవే కారణాలతో బొలీవియా మొరేల్స్‌ను సైనిక కుట్రతో అమెరికా అధికారం నుంచి దించేసింది. ఇప్పుడు చిలీ ప్రజల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్నీ, సంక్షేమాన్నీ పరిరక్షించుకొనేందుకు బొలీవియన్లు ఉద్యమిస్తారని, అమెరికా కుట్రలు, కుతంత్రాల మెడలు వంచుతారని ఆశిద్దాం.

9, నవంబర్ 2019, శనివారం

అయోధ్య తీర్పు: రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదం కేసు మొత్తం కథ ఇదీ



Ayodhya Verdict: Ram Janmabhoomi-Babri Masjid land dispute case
అయోధ్యలోని ‘రామ జన్మభూమిబాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వివాదానికి ఈ రోజు ముగింపు పడుతుందని అంతా భావిస్తున్నారు. రాజకీయంగామతపరంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పు వెలువడిన తరువాత దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

ఇంతకీ ఏమిటీ వివాదం?

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులుముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో కొందరు మసీదును కూల్చడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి.
ఆ తరువాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తూ వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ్ లల్లాసున్నీ వక్ఫ్ బోర్డునిర్మొహీ అఖాడాలకు సమానంగా పంచాలని చెప్పింది.
దీనిపై హిందువులుముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేయటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పును సస్పెండ్ చేసింది.
అప్పటి నుంచి ఈ కేసును విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఆగస్టు 6 నుంచి తుది వాదనలు విన్నది.

కేసు పూర్వాపరాలు ఇవీ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అయోధ్యలో రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలం ఇది. ఇక్కడే బాబ్రీ మసీదు కూడా ఉండేది. ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించిన వివాదం ఇది. ఇక్కడ బాబ్రీ మసీదును నిర్మించడానికి ముందు అక్కడున్న ఆలయాన్ని కూల్చారన్నది ఒక వాదన. బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ధ్వంసం చేశారు. ఆ తరువాతే ఈ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. అక్కడ 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకురెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకుమూడో భాగం నిర్మోహి అఖాడాకు చెదుతుందని తీర్పు చెప్పారు.

హిందూముస్లింల వాదనలేంటి?

బాబ్రీ మసీదు నిర్మించిన స్థలం రాముడి జన్మస్థలమని16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారన్నది హిందువుల వాదన. ఆ మసీదులో 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామనిఆ ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారన్నది ముస్లింల వాదన.

న్యాయమూర్తుల్లోనూ భిన్నాభిప్రాయం

అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని చెప్పారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ''ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా'' దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు.
అదే ధర్మాసనంలో ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని.. ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.

31, అక్టోబర్ 2019, గురువారం

ఇందిరాగాంధీనే పార్టీ నుంచి బహిష్కరించిన ఏపీ మాజీ సీఎం



ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అదే తొలి ఓటమి. ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నిలువునా చీలిపోయింది. ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. 1977 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. కాసునే విజయం వరించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు.
దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు. 'ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర' అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు. అయితే, ఇందిర వర్గం ఏమీ వెనక్కి తగ్గలేదు. వీసీ శుక్లా, బన్సీ లాల్, అంబికా సోనీ, కరణ్ సింగ్, డీకే బారువా వంటివారు తనతో లేకున్నా బూటా సింగ్, ఏపీ శర్మ, జీకే మూపనార్, బుద్ధప్రియ మౌర్య వంటి కొత్త అనుకూల వర్గంతో ఇందిర తన 'ఇందిరా కాంగ్రెస్' వైపు నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.బూటా సింగ్ కొందరు నేతలను వెంటబెట్టుకుని కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి వెళ్లి 'నెహ్రూ కుమార్తెనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తావా' అంటూ నిలదీశారు. ఆ సంగతి మళ్లీ ఇందిరకు చెప్పగా.. 'ఎంతైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అమర్యాదకరంగా మాట్లాడడం సరికాదు' అని బూటాసింగ్‌ను మందలించారని రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో పేర్కొన్నారు.
బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు.అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీ గుర్తయిన 'ఆవు - దూడ' చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున 'ఆవు, దూడ' గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తుకే తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎలక్షన్ కమిషన్ అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది. మరోవైపు, ఇందిర వర్గం చీలిపోయిన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని 'రెడ్డి కాంగ్రెస్'గా పిలిచేవారు.  అటు రెడ్డి కాంగ్రెస్, ఇటు ఇందిరా కాంగ్రెస్ ఎవరికి వారు పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేశారు. బూటాసింగ్, ఏపీ శర్మ, మూపనార్ వంటి ఇందిర నమ్మకస్థులంతా ఆమెకు మద్దతుగా 700 మందికిపైగా ఉన్న ఏఐసీసీ సభ్యుల సంతకాలను సేకరించేందుకు దేశ వ్యాప్త యాత్ర మొదలుపెట్టారు. లఖ్‌నవూ, జైపూర్, పట్నా, భోపాల్, ముంబయి, జమ్ము, శ్రీనగర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, తిరువనంతపురం, బెంగళూరు సహా పలు ఇతర రాజధాని నగరాల్లో వారికి మంచి మద్దతు లభించింది.
కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని సూచించింది ఎలక్షన్ కమిషన్. అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేస్తారు బూటాసింగ్. లైన్లన్నీ అస్పష్టంగా ఉన్నాయి.. బూటాసింగ్ చెబుతున్నది ఇందిరకు స్పష్టంగా వినిపించలేదు. ఆ సమయంలో ఎంతో గందరగోళం చోటుచేసుకుంది. బూటాసింగ్ హాత్(హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు. ఆ సంగతి అర్థం చేసుకున్న బూటాసింగ్... ఏనుగు కాదు హస్తం అని వివరిస్తున్నా ఫోన్ లైన్ అస్పష్టంగా ఉండడం, బూటాసింగ్ స్వరం కూడా బాగా బొంగురుగా ఉండడంతో ఇందిరకు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆమె ఫోన్ రిసీవర్‌ను పక్కనే ఉన్న పీవీ నరసింహరావుకు ఇచ్చారు.బహు భాషా కోవిదుడైన పీవీకి వెంటనే విషయం అర్థమైంది. బూటా చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల మధ్య పోలిక వల్ల గందరగోళం తలెత్తిందని అర్థం చేసుకుని వెంటనే హస్తానికి ప్రత్యాయపదం సూచించి ఇందిరకు ఆ మాట చెప్పమంటారు. ''బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా''(బూటాసింగ్ గారూ.. పంజా అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ''ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి'' అని చెప్తారు. ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో రాసుకొచ్చారు.

హస్తం గుర్తు చాలామంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఇదేం గుర్తన్న విమర్శలు వచ్చాయి. కానీ, ఇందిర మాత్రం ఈ కొత్త గుర్తుపై సంతోషించారట. అందుకు కారణం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి.ఈ కొత్త గుర్తుతో ఆ బాధ తప్పిందని ఇందిర సంతోషించారట. ఇందిర గాంధీ కొత్త కాంగ్రెస్‌కు బలం చేకూరాక ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం పార్టీకి చెందిన వివిధ నేతల ఇళ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ, ఏదీ అంత అనుకూలంగా కనిపించలేదు. 3 జనపథ్‌లో ఎం.చంద్రశేఖర్ ఇల్లు.. ఆ తరువాత పండిట్ కమలాపతి త్రిపాఠీ ఇల్లు పరిశీలించారు. కానీ, వివిధ కారణాల వల్ల వాటినీ వద్దనుకున్నారు. ఆ సమయంలో జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లు బూటాసింగ్ దృష్టికొచ్చింది. లోక్‌సభ ఎంపీగా ఉన్న వెంకటస్వామి అప్పటికి ఒంటరిగా అక్కడ నివసిస్తున్నారు. అప్పటికి అవివాహితుడైన వెంకటస్వామి ఇల్లు ఎంతోమంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆశ్రయంగా ఉండేది. 10 జనపథ్‌‌లో అగ్రనేతలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారందరికీ 24 అక్బర్ రోడ్‌లోని వెంకటస్వామి ఇల్లు అడ్డాగా ఉండేది.  అక్కడ 'ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఇందిర)' అనే బోర్డు ఏర్పాటు చేయడంతో వెంకటస్వామి ఇల్లు అలా కాంగ్రెస్(ఐ) కార్యాలయంగా మారిందని '24 అక్బర్ రోడ్' పుస్తకంలో కిద్వాయి రాసుకొచ్చారు.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగ్గా మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్(ఐ) మంచి విజయం సాధించింది. బ్రహ్మానందరెడ్డి వర్గం ప్రభావం చూపలేకపోయింది. దీంతో కొద్దికాలానికే కాసు బ్రహ్మానందరెడ్డి తన నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్(ఆర్)ను కాంగ్రెస్(ఐ)లో విలీనం చేశారు. అనంతరం ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1980 లోక్‌సభ ఎన్నికల్లో 351 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాసు బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు 1964 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.