22, నవంబర్ 2019, శుక్రవారం

George Reddy జార్జి రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?


జార్జి రెడ్డి(George Reddy)... ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)లో 47 ఏళ్ల కిందట హత్యకు గురయిన విద్యార్థి నేత. ఆయన జీవితం నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా తెలుగునాట ఆయన చుట్టూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన విద్యార్థులు, అణగారిన వర్గాల సమస్యల కోసం పోరాడిన నాయకుడంటూ కొందరు.. కాదు కాదు, ఆయనో రౌడీ అంటూ మరికొందరు వాదిస్తున్నారు. జార్జిరెడ్డి అందరిపై దౌర్జన్యాలు చేసేవాడని.. బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగరరావును ఆయన అప్పట్లో కొట్టాడన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆయన్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు.. ఎలా చంపారు? నిందితులు ఎలా విడుదలయ్యారనే విషయాల్లో ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికగా అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. ఆయన్ను భగత్ సింగ్, చేగువేరాలతో పోల్చుతూ పాత అభిమానులతో పాటు కొత్త అభిమానులు పుట్టుకొస్తుంటే ఆయన్ను విమర్శించేవారూ ఎక్కువయ్యారు.
ఇదే సమయంలో జార్జి రెడ్డి పేరే కులాన్ని సూచిస్తున్నప్పటికీ ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జార్జి రెడ్డి కులం, ఊరు, తల్లిదండ్రులు, జన్మదినం, భార్య పేరు, లవ్ ఎఫైర్స్ ఉన్నాయా అంటూ గూగుల్‌ను ప్రశ్నించి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిలో కొన్నిటికి సమాధానమే ఈ ఆర్టికల్.
జార్జిరెడ్డి జన్మదినం: భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరమైన 1947లో సంక్రాంతి రోజున(జనవరి 15న) జార్జి రెడ్డి జన్మించారు.
జార్జి రెడ్డి తల్లిదండ్రులు: చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్. తల్లి లీలా వర్గీస్‌ది కేరళ రాష్ట్రం పాల్ఘాట్. తండ్రిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా.
జార్జి రెడ్డి భార్య: జార్జి రెడ్డి అవివాహితుడు. 25 ఏళ్ల వయసులోనే హత్యకు గురయ్యాడు.
జార్జి రెడ్డి ప్రేమ కథ: జార్జి రెడ్డి ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా పోరాడారని సమకాలీకులు చెబుతారు. ఆయన స్త్రీలను గౌరవించేవారని, ఎవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని చెబుతారు.
జార్జి రెడ్డి మరణం: జార్జి రెడ్డి 1972, ఏప్రిల్ 14న ఉస్మానియా క్యాంప‌స్‌లో హత్యకు గురయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి