29, మార్చి 2023, బుధవారం

మే 10న కర్ణాటక ఎన్నికల పోలింగ్.. 13న రిజల్ట్

karnataka map, karnataka assembly elections


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మే 10న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడతాయి. 

కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి 119 మంది సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి 75 మంది ఉన్నారు. జనతాదళ్ సెక్యులర్ పార్టీకి 28 మంది సభ్యులు ఉన్నారు. 

ప్రస్తుతం అక్కడ బీజేపీ పాలన సాగుతుండగా.. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో స్థానికంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను తొలగించడం.. బంజారాలకు రిజర్వేషన్లు తగ్గించి వక్కలిగలకు రిజర్వేషన్లు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు బొమ్మై.

31, డిసెంబర్ 2022, శనివారం

New Year జనవరి 1నే ఎందుకు ప్రారంభమవుతుంది.. వేడుకలు ఈ తేదీనే ఎందుకు జరుపుకొంటారు?

2023 Happy New year

ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే 2070 సంవత్సరాల వెనక్కు వెళ్లాలి. క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్.. జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.

సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం కొన్నిసార్లు లీప్ డే ఒకదానిని యాడ్ చేస్తాం. భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. కాబట్టే రోజూ ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంటాయి. 

అయితే, క్యాలండర్‌లో ఏ రోజుతో సంవత్సరం ప్రారంభించాలి అనే విషయంలో  సీజర్ ఆలోచించారు. 

రోమన్లకు జనవరి నెల ఇంపార్టెంట్. వారి దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది.

యూరప్‌లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువగా ఉండేది కూడా ఈ నెలలోనే.

అందుకే ఆయన జనవరితో క్యాలండర్ ప్రారంభించాలని నిర్ణయించారు. 

రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఆయా ప్రాంతాలకు చేరింది.

అయితే, పాశ్చాత్యంలో 5వ శతాబ్ధంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికారం చెలాయించింది.

అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు.

Happy New year 2023


క్రిస్టియన్ దేశాలు మార్చి 25తో మొదలుపెట్టాలని కోరుకున్నాయి..

చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి. దేవదూత గాబ్రియెల్.. మేరీకి కనిపించిన తేదీగా మార్చి 25కి  ప్రాశస్త్యం ఉంది.

క్రీస్తు జన్మించిన రోజు క్రిస్మస్. అయితే, దేవుని నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నావంటూ మేరీకి క్రీస్తు జననం గురించి చెప్పింది మాత్రం మార్చిలో. అప్పటి నుంచే క్రీస్తు కథ ప్రారంభమవుతుంది. మరెన్నో కారణాలతో పాటు మార్చి 25వ తేదీ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం కావాలనటానికి ఇది కూడా ఒక కారణం.

పోప్ 13వ గ్రెగరీ 16వ శతాబ్ధంలో గ్రెగరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.

క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.

అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది.

అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, యూరప్‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది.

ఇక వర్తమానంలోకి వస్తే.. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి.

అందుకే మనం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలను జరుపుకొంటున్నాం.


26, డిసెంబర్ 2022, సోమవారం

జీ20.. మోదీ తన ముద్ర చూపిస్తారా

Modi in G20


జీ20.. కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఇదే మాట. 

మామూలుగా అయితే జీ 7, జీ 10, జీ 15, జీ 20 వంటి వాటిపై సాధారణ ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. 

కానీ, ఈ సారి జీ20 సమావేశాల గురించి ఎన్నడూ లేనట్లుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మీడియాలోనూ విపరీతమైన కవరేజ్ కనిపించింది. 

జీ 20 సమావేశాలకు మోదీ వెళ్లడం నుంచి.. ఆయన్ను అమెరికా అధ్యక్షుడు పలకరించడం, ‘యుద్ధాలు చేసే కాలం కాదు ఇది’ అని మోదీ అంటే ప్రపంచ నాయకులంతా శభాష్ అనడం... చైనా అధ్యక్షుడు కనిపించగానే మోదీ కుర్చీలోంచి లేచి మరీ పలకరించడం... ఒకటా రెండా ప్రతిదీ పెద్ద విషయంగా ఇండియన్ మీడియాలో వార్తలొచ్చాయి. సామాన్యులూ అదే స్థాయిలో చర్చించుకున్నారు. 

ఇదంతా ఇండోనేసియాలోని బాలీలో జరిగిన జీ 20 సమావేశాల సంగతి.. ఇక అక్కడ నుంచి సీన్ ఇండియాకు మారిపోయింది. 2022లో ఇండోనేసియా నేతృత్వంలో జీ20 సమావేశాలు జరగ్గా వచ్చే సమావేశాలు భారత్ నాయకత్వంలో జరగబోతున్నాయి. 

రొటేషన్‌లో భాగంగా 2023లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇండోనేసియాలో జీ20 సమావేశాల ముగింపులో ఆ బాధ్యతలు మోదీకి అప్పగించారు. 

దాని ప్రకారం... 2022 డిసెంబర్ 1 నుంచే భారత్ అధ్యక్షత(ప్రెసిడెన్సీ) మొదలైపోయింది. తదుపరి సమావేశాలు 2023 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగబోతున్నాయి. 

2024 సమావేశాలకు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల్లో భారత్‌, మోదీ స్థాయి ఇటీవల కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహణ విషయంలో మోదీపై ప్రపంచ దేశాల్లో భారీ అంచనాలున్నాయి. 

ఈ సదస్సులో ఆయన ముద్ర కనిపిస్తుందని భావిస్తున్నారు.

Modi G20


ఇంతకీ ఏమిటీ జీ20?

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. 

ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 85 శాతం వాటా ఈ 20 మంది సభ్యులదే. 

ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఈ 20 దేశాలలోనే ఉంటారు.

ఈ జీ20 బృందానికి తనకంటూ శాశ్వత సిబ్బంది ఎవరూ ఉండరు. కాబట్టి ఈ బృందంలోని ఒక దేశం తమ ప్రాంతం వంతు వచ్చినపుడు సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది.

తదుపరి శిఖరాగ్ర సదస్సును.. ఆ సదస్సు కంటే ముందు నిర్వహించాల్సిన అనేక సమావేశాలను నిర్వహించే బాధ్యతను ఆ దేశం తీసుకుంటుంది. ప్రస్తుతం భారత్ ఇదే పనిలో ఉంది.

జీ-20 సభ్యులు కాని దేశాలను ఈ శిఖరాగ్రానికి అతిథులుగా ఆహ్వానించటానికి, అటువంటి దేశాలను ఎంపిక చేయటానికి ఈ దేశానికి వీలుంటుంది. అలా స్పెయిన్‌ను ఎల్లప్పుడూ ఈ భేటీకి ఆహ్వానిస్తుంటారు.

జీ20 సభ్య దేశాలు ఏవి?

గ్రూప్ ఆఫ్ 20(జీ20)లో 20 సభ్య దేశాలున్నాయి. 

అవి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్. 

ఇందులో 19 దేశాలు కాగా 20వది యూరప్ దేశాల సమాఖ్య.

మరో 9 దేశాలను ఆహ్వానించిన భారత్

ఈ దేశాల అధిపతులతో పాటు మరో 9 దేశాల నేతలనూ భారత్ ఈ సమావేశాలకు ఆహ్వానించింది.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా సయీద్ హుసేన్, మారిషన్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్, నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ, ఒమన్ రాజ్యాధిపతి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, సింగపూర్ ప్రధాని లీ సేన్ లూంగ్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బమబిన్ జయీద్ అల్ నహ్యాన్‌లను ఆహ్వానించారు. 

స్పెయిన్‌‌ను సాధారణంగా  ప్రతి జీ20 సమావేశాలకూ ఆహ్వానిస్తుంటారు.

మొట్టమొదటి సమావేశం 1999లో

ఆసియాలో ఏర్పడిన  ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో చాలా దేశాల మీద ప్రభావం చూపిన పరిస్థితుల్లో 1999లో జీ-20 ఏర్పాటైంది. మొదట 7 దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌లతో ఏర్పాటైంది. 1997-98 నాటి ఆర్థిక సంక్షోభం, అనంతర పరిణామల నేపథ్యంలో ఈ దేశాలన్నీ ఏకమై చర్చించుకున్నాయి.

గ్రూప్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు సమావేశమైన అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య అంశాలు చర్చించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.  ఈ గ్రూప్ తొలి శిఖరాగ్ర సమావేశమూ అదే ఏడాది బెర్లిన్‌లో జరిగింది.

మొదట్లో ఈ జీ-20 సదస్సుకు ప్రధానంగా ఆయా దేశాల ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు. కానీ 2007లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో అది మారిపోయింది. బ్యాంకులు కుప్పకూలటం, నిరుద్యోగం పెరగటం, వేతనాల్లో మాంద్యం నెలకొనటం వంటి పరిణామాలతో 2008 నుంచి జీ20 ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారిపోయింది.

ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షులు/ప్రధానమంత్రులు తప్పనిసరిగా హాజరవుతున్నారు.

జీ20 ఎలా పనిచేస్తుంది

జీ20 అజెండాను ముందుకు నడిపించేలా శిఖరాగ్ర సమావేశాలకు ముందు ఏడాది పాటు ఆతిథ్య దేశం వివిధ సమావేశాలు నిర్వహిస్తుంటుంది. 

ఇందులో భాగంగా రెండు రకాల సమావేశాలను సమాంతరంగా నిర్వహిస్తుంటుంది. వీటినే ఫైనాన్షియల్ ట్రాక్ మీటింగ్స్, షెర్పా ట్రాక్ మీటింగ్స్ అంటారు. 

జీ20 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్ల నేతృత్వంలో జరిగేవి ఫైనాన్షియల్ ట్రాక్ మీటింగ్స్. 

ఇక షెర్పా ట్రాక్ సమావేశాలంటే సభ్యదేశాల అధినేతల ప్రతినిధులు పాల్గొనే, వారి నాయకత్వంలో జరిగే సమావేశాలు. ఏడాది పాటు 20 సభ్య దేశాల అధ్యక్షులో, ప్రధానులో నిరంతరం ఈ సమావేశాలకు రానవసరం లేకుండా వారి ప్రతినిధులు(షెర్పా) హాజరవుతూ తమ దేశాల అభిప్రాయాన్ని, అజెండాను, అభ్యంతరాలను అన్నీ అక్కడ తెలియజేస్తారు. 

అవసరమైన ఒప్పందాలు ఏవైనా ఉంటే వాటిపై సంతకాలూ వారే చేస్తారు. 

సమావేశాల సబ్జెక్ట్ బట్టి దేశాలకు ప్రాతినిధ్యం వహించే షెర్పాలు మారొచ్చు. 

భారత్ తరఫున షెర్పాగా అమితాబ్ కాంత్ వ్యవహరిస్తున్నారు.

ఫైనాన్స్ ట్రాక్ కాన్ఫరెన్సులలో ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ల స్థాయిలో లక్ష్యాలు, ముఖ్యోద్దేశాల వారీగా చర్చలు జరుగుతాయి. 

షెర్పా ట్రాక్ కాన్ఫరెన్సులలో నెగోషియేషన్స్, అగ్రిమెంట్స్ వంటివి ఉంటాయి. 

ఈ రెండు రకాల సమావేశాలతో పాటు పౌర సమాజంలోనివారు, ఎంపీలు, థింక్ ట్యాంక్స్, మహిళలు, యువత, కార్మికులు, వ్యాపారవేత్తలు, అధ్యయనకర్తలతో ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశాలు జరుగుతుంటాయి. 

వర్కింగ్ గ్రూప్స్‌లో యునైటెడ్ నేషన్స్, ఐఎంఎఫ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ వంటి సంస్థలూ ఉంటాయి.

2023 దిల్లీ సమావేశాల ఉద్దేశం ఏమిటి

దిల్లీ సమావేశాల థీమ్ ‘వసుధైవ కుటుంబం’. దీన్నే ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’గా అంతర్జాతీయ సమాజానికి చెబుతున్నారు. 

మనుషులొక్కరే కాదు ఈ భూమి మీద జంతువులు, మొక్కలు, చివరికి సూక్ష్మజీవుల ప్రాణాలకూ విలువ ఇవ్వాలనేది ముఖ్యోద్దేశం. 

దీనికి అనుగుణంగానే పర్యావరణ సుస్థిరతకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే జీవనశైలిని వ్యక్తిగత స్థాయిలో, సామాజిక స్థాయిలో, జాతీయ విధాన స్థాయిలో రూపొందించుకోవడం, ఆచరించడం లక్ష్యంగా చర్చలు సాగుతాయి. 

పర్యావరణ సుస్థిరత సాధించే దిశగా ప్రపంచంలో మార్పులు తీసుకొస్తూ స్వచ్ఛమైన హరిత భవితను నిర్మించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు ఉంటుంది.

శిఖరాగ్రానికి ముందు సన్నాహక సమావేశాలు ఏవి, ఎప్పుడు, ఎక్కడ జరుగుతున్నాయి?

భారత్ అధ్యక్షతన జీ20కి సంబంధించిన సన్నాహక సమావేశాలు ఇప్పటికే మొదలైపోయాయి. 

ఈ సమావేశాలు జరగడానికి ముందు దేశంలోని అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. 

అనంతరం డిసెంబర్ 13 నుంచి 15 వరకు బెంగళూరులో ఫైనాన్షియల్ ట్రాక్ సమావేశాలు మొదలయ్యాయి. షెర్పా ట్రాక్ సమావేశాలూ మొదలయ్యాయి. 

తెలుగు రాష్ట్రాలలో లేని సమావేశాలు

బెంగళూరు, చండీగఢ్, చెన్నై, గౌహతి, ఇండోర్, జోధ్‌పూర్, ఖజురాహో, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె, రాణ్ ఆఫ్ కచ్, సూరత్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్ నగరాల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు కొన్ని సమావేశాలు వర్చువల్‌గా జరగనున్నాయి. 

తెలుగు రాష్ట్రాలలోని ఏ నగరంలోనూ ఈ సన్నాహక సమావేశాలను నిర్వహించడం లేదు.

లోగోపై వివాదం

భారత్ నిర్వహించే జీ20 సదస్సు లోగోలో కమలం ఉండడంపై విమర్శలు వచ్చాయి. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది. 

ఈ లోగోపై మోదీ స్పందిస్తూ.. ‘జీ20 లోగో కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు. ఇది ఒక సందేశం. ఇది ఒక భావోద్వేగం. మన నరనరాల్లో ఇది జీర్ణించుకుపోయింది. మన ఆలోచనల్లో భాగమైన తీర్మానం ఇది. ఈ లోగో, థీమ్ ద్వారా మనం ప్రపంచానికి సందేశం ఇస్తున్నాం’’అని చెప్పారు. అంతేకాదు.. కమలాన్ని ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా మోదీ అభివర్ణించారు. కమలాన్ని ఆకాంక్షకు చిహ్నంగా మోదీ చెప్పారు. ‘‘నేడు కోవిడ్-19 దుష్ప్రభావాలను ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయి. ఒకవైపు ఘర్షణలు, మరోవైపు ఆర్థిక మందగమనం అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో కొత్త ఆశలను ఈ జీ20 లోగో చిగురింపచేస్తోంది’’ అని ఆయన సమర్థించుకున్నారు. మరోవైపు విపక్షాలు దీన్ని బీజేపీ ఎన్నికల గుర్తు అంటుంటే బీజేపీ నేతలు మాత్రం భారతదేశ జాతీయ పుష్పం అని చెప్తున్నారు.

కశ్మీర్‌లో నిర్వహించాలనుకుని దిల్లీ..

జీ20 సమావేశాల వేదిక విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. 

తొలుత ఈ సదస్సును కశ్మీర్‌లో నిర్వహించాలనుకుంది. 

ఇందుకోసం అయిదుగురు సభ్యులతో ఒక కమిటీ కూడా వేశారు. 

కానీ, పాకిస్తాన్, చైనా, తుర్కియే, సౌదీ అరేబియా నుంచి అభ్యంతరాలు రావడంతో దిల్లీకి మార్చారు.

ప్రపంచమంతా కష్టాల్లో ఉన్న సమయంలో భారత్‌పై బాధ్యత

ప్రపంచంలోని అనేక దేశాలు ద్రవ్యోల్బణం, మాంద్యం ఎదుర్కొంటున్న తరుణంలో... రష్యా, యుక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో, రష్యా-యూరోపియన్ యూనియన్ మధ్య దూరం పెరిగిన తరుణంలో... స్వయంగా తాను కూడా చైనాతో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ శిఖరాగ్ర సమావేశపు పగ్గాలు తీసుకుంది. 

వచ్చే సమావేశాలలో ఇవన్నీ కీలకంగా చర్చకు రానున్నాయి. 

అయితే... మొన్నటి బాలీ సమావేశాలలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ సుహృద్భావంగా కనిపించడంతో రానున్న సమావేశాలపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. 

అయితే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టర్లో గల్వాన్ తరహాలో భారత్, చైనా సైనికులు వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు దిగారు. 

ఇలాంటి ఉద్రిక్తతలు మరింత పెరిగితే వచ్చే సమావేశాల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాలి.

19, నవంబర్ 2022, శనివారం

ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్

kasu brahmanandareddy, Indira Gandhi

దేశాన్ని అట్టుడికించిన అత్యయిక పరిస్థితి తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అదే తొలి ఓటమి.

ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నిలువునా చీలిపోయింది. ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు.

1977 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు.

కాసునే విజయం వరించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు.

congress president


ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు.

దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు.

'ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర' అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు.

అయితే, ఇందిర వర్గం ఏమీ వెనక్కి తగ్గలేదు. వీసీ శుక్లా, బన్సీ లాల్, అంబికా సోనీ, కరణ్ సింగ్, డీకే బారువా వంటివారు తనతో లేకున్నా బూటా సింగ్, ఏపీ శర్మ, జీకే మూపనార్, బుద్ధప్రియ మౌర్య వంటి కొత్త అనుకూల వర్గంతో ఇందిర తన 'ఇందిరా కాంగ్రెస్' వైపు నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.

Boota Singh


బూటా సింగ్ కొందరు నేతలను వెంటబెట్టుకుని కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి వెళ్లి 'నెహ్రూ కుమార్తెనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తావా' అంటూ నిలదీశారు.

ఆ సంగతి మళ్లీ ఇందిరకు చెప్పగా.. 'ఎంతైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అమర్యాదకరంగా మాట్లాడడం సరికాదు' అని బూటాసింగ్‌ను మందలించారని రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో పేర్కొన్నారు.

బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.

153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు.

అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది.

పార్టీ గుర్తయిన 'ఆవు - దూడ' చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది.

అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున 'ఆవు, దూడ' గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు.

కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తుకే తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎలక్షన్ కమిషన్ అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది.

మరోవైపు, ఇందిర వర్గం చీలిపోయిన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని 'రెడ్డి కాంగ్రెస్'గా పిలిచేవారు.

అటు రెడ్డి కాంగ్రెస్, ఇటు ఇందిరా కాంగ్రెస్ ఎవరికి వారు పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేశారు. బూటాసింగ్, ఏపీ శర్మ, మూపనార్ వంటి ఇందిర నమ్మకస్థులంతా ఆమెకు మద్దతుగా 700 మందికిపైగా ఉన్న ఏఐసీసీ సభ్యుల సంతకాలను సేకరించేందుకు దేశ వ్యాప్త యాత్ర మొదలుపెట్టారు.

లఖ్‌నవూ, జైపూర్, పట్నా, భోపాల్, ముంబయి, జమ్ము, శ్రీనగర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, తిరువనంతపురం, బెంగళూరు సహా పలు ఇతర రాజధాని నగరాల్లో వారికి మంచి మద్దతు లభించింది.

కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని సూచించింది ఎలక్షన్ కమిషన్.

P V Narasimha Rao


అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.

ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేస్తారు బూటాసింగ్.

లైన్లన్నీ అస్పష్టంగా ఉన్నాయి.. బూటాసింగ్ చెబుతున్నది ఇందిరకు స్పష్టంగా వినిపించలేదు.

ఆ సమయంలో ఎంతో గందరగోళం చోటుచేసుకుంది. బూటాసింగ్ హాత్(హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు.

ఆ సంగతి అర్థం చేసుకున్న బూటాసింగ్... ఏనుగు కాదు హస్తం అని వివరిస్తున్నా ఫోన్ లైన్ అస్పష్టంగా ఉండడం, బూటాసింగ్ స్వరం కూడా బాగా బొంగురుగా ఉండడంతో ఇందిరకు ఏమీ అర్థం కాలేదు.

దాంతో ఆమె ఫోన్ రిసీవర్‌ను పక్కనే ఉన్న పీవీ నరసింహరావుకు ఇచ్చారు.

బహు భాషా కోవిదుడైన పీవీకి వెంటనే విషయం అర్థమైంది. బూటా చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల మధ్య పోలిక వల్ల గందరగోళం తలెత్తిందని అర్థం చేసుకుని వెంటనే హస్తానికి ప్రత్యాయపదం సూచించి ఇందిరకు ఆ మాట చెప్పమంటారు. ''బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా''(బూటాసింగ్ గారూ.. పంజా అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ''ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి'' అని చెప్తారు.

ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో రాసుకొచ్చారు.

హస్తం గుర్తు చాలామంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఇదేం గుర్తన్న విమర్శలు వచ్చాయి. కానీ, ఇందిర మాత్రం ఈ కొత్త గుర్తుపై సంతోషించారట.

అందుకు కారణం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి.

ఈ కొత్త గుర్తుతో ఆ బాధ తప్పిందని ఇందిర సంతోషించారట.

Venkata Swamy Kaka


ఇందిర గాంధీ కొత్త కాంగ్రెస్‌కు బలం చేకూరాక ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం పార్టీకి చెందిన వివిధ నేతల ఇళ్లను పరిశీలనలోకి తీసుకున్నారు.

కానీ, ఏదీ అంత అనుకూలంగా కనిపించలేదు. 3 జనపథ్‌లో ఎం.చంద్రశేఖర్ ఇల్లు.. ఆ తరువాత పండిట్ కమలాపతి త్రిపాఠీ ఇల్లు పరిశీలించారు. కానీ, వివిధ కారణాల వల్ల వాటినీ వద్దనుకున్నారు.

ఆ సమయంలో జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లు బూటాసింగ్ దృష్టికొచ్చింది. లోక్‌సభ ఎంపీగా ఉన్న వెంకటస్వామి అప్పటికి ఒంటరిగా అక్కడ నివసిస్తున్నారు.

అప్పటికి అవివాహితుడైన వెంకటస్వామి ఇల్లు ఎంతోమంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆశ్రయంగా ఉండేది. 10 జనపథ్‌‌లో అగ్రనేతలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారందరికీ 24 అక్బర్ రోడ్‌లోని వెంకటస్వామి ఇల్లు అడ్డాగా ఉండేది.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగ్గా మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్(ఐ) మంచి విజయం సాధించింది. బ్రహ్మానందరెడ్డి వర్గం ప్రభావం చూపలేకపోయింది.

దీంతో కొద్దికాలానికే కాసు బ్రహ్మానందరెడ్డి తన నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్(ఆర్)ను కాంగ్రెస్(ఐ)లో విలీనం చేశారు.

అనంతరం ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1980 లోక్‌సభ ఎన్నికల్లో 351 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాసు బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు 1964 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా

Kim Daughter: ఉత్తరకొరియా సుప్రీం లీడర్ కిమ్ కూతురిని చూశారా


పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా

International men's day


 

నవంబరు 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

కానీ ప్రపంచంలో చాలా మందికి అసలిలాంటి రోజు ఉందనే విషయం కూడా తెలియదు.

 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చే ప్రాముఖ్యత పురుషుల దినోత్సవానికి కనిపించట్లేదు. అసలు పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు. 

నవంబరు 19వ తేదీనే ఎందుకు? ఈ రోజున పురుషులు తెలుసుకోవాల్సిన విషయాలేంటి

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు.

 1969నుండి పురుషుల దినోత్సవం గురించి డిమాండ్ చేస్తున్నారు. 

చివరికి డాక్టర్ జీరోమ్ టీలక్సింగ్ చేత 1999నుండి పురుషుల దినోత్సవం మొదలైంది. 

జీరోమ్ టీలక్సింగ్ తన తండ్రి పుట్టినరోజైన నవంబరు 19వ తేదీని పురుషుల దినోత్సవంగా మొదలుపెట్టాడు.

ప్రపంచ పురుషుల సమస్యలను పరిష్కరించడానికి, మానసిక, శారీరక ఒత్తిడి వంటి వాటిపై చర్చించి, ఆత్మహత్యలు చేసుకోనివ్వకుండా వారిలో ధైర్యాన్ని నింపే ఉద్దేశ్యంతో ప్రపంచ పురుషుల దినోత్సవం ప్రారంభమైంది. 

మానసిక ఒత్తిడి తట్టుకోలేక 45సంవత్సరాల లోపు గల వయస్సులో చాలామంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

ఈ సమస్య పరిష్కారానికై పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు.

Kim Daughter: ఉత్తరకొరియా సుప్రీం లీడర్ కిమ్ కూతురిని చూశారా 

అయినా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ? 


Kim Daughter: ఉత్తరకొరియా సుప్రీం లీడర్ కిమ్ కూతురిని చూశారా

kim jong un daughter kim ju ae



ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంగతి తెలుసు కదా. మామూలు నియంత కాదు... మహామహా నియంతలే నోరెళ్లబెడతారు ఆయన గురించి విని.

అగ్రరాజ్యం అమెరికాకే పోయించే రకం కిమ్. తిండి, అభివృద్ధి లేకుండా తన దేశం, ప్రజలు అల్లాడిపోతున్నా కూడా పగపగ అంటూ రోజూ తన దాయాది దేశం దక్షిణ కొరియాపైకి, దానికి మద్దతిచ్చే అమెరికా వైపు మిసైళ్లు ప్రయోగిస్తుంటాడు ఈ కిమ్.

కోవిడ్ వచ్చిన రోగులకు ప్రపంచంలోని ప్రతి దేశమూ ట్రీట్మెంట్ చేస్తే.. ఉత్తర కొరియాలో ఫస్ట్ కోవిడ్ వచ్చిన మనిషికి కిమ్ ఇచ్చిన ట్రీట్మెంట్.. తుపాకీ బుల్లెట్. అట్లుంటది మనోడితోని.

కిమ్ తన గురించి ఒక్క చిన్న క్లూ కూడా అమెరికా సీక్రెట్ ఏజెంట్లకు కూడా దొరక్కుండా జాగ్రత్తపడుతుంటాడు.

ఆయన భార్య ఎలా ఉంటుందో చూసినవారు ఈ భూమి మీద చాలా కొంచెం మంది మాత్రమే. ఎక్కడా ఫొటో కూడా కనిపించదు.

ఇక ఆయన పిల్లల గురించైతే ఇంతవరకు ఎవరికీ తెలియదు.

అలాంటిది.... ఇప్పుడు ఒక్కసారిగా కిమ్ కూతురి ఫొటోలు బయటకు వచ్చాయి. అది కూడా కిమ్ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోలు వచ్చాయి. అది కూడా ఉత్తరకొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వీటిని ఆన్ లైన్లో ఉంచింది. కానీ, ఎక్కడా కిమ్ కూతురు అని ఏజెన్సీ రాయలేదు. ఆమె పేరు కూడారాయలేదు. అయితే కిమ్ చేయి పట్టుకుని నడిచే పాప ఆమె కూతురు కాకుండా వేరే ఎవరూ అయి ఉండరన్న అంచనాతో అంతా ఆమెను కూతురిగానే భావిస్తున్నారు.

kim ju au Kim Daughter


కిమ్ ఆమెను పబ్లిగ్గా బయటకు తీసుకొచ్చారు. ఉత్తర కొరియా తయారుచేపసిన అతిపెద్ద ఖండాంతర క్షిపనిని శుక్రవారం పరీక్షించిన సమయంలో తనిఖీ చేయడానికి వెళ్లిన కిమ్ తనతో పాటు కూతురిని కూడా తీసుకెళ్లారు. ఆమె పేరు ‘కిమ్ చూ ఆ’ అంటున్నారు. ఆమె వయసు 12 నుంచి 13 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.

అంతకుముందు సెప్టెంబరు నెలలో ఉత్తర కొరియా నేషనల్ డే వేడుకల సమయంలో కూడా ఆమెను కిమ్ తీసుకొచ్చారని కొందరు చెప్పినా ఆ ఫొటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా లేవు.

కాగా కిమ్‌కు ముగ్గురు పిల్లలున్నారని.. అందులో ఈ అమ్మాయే పెద్దదని.. మరో అమ్మాయి, అబ్బాయి ఉన్నారని చెబుతుంటారు.

అయితే, కిమ్ కుటుంబం గురించి ఊహాగానాలే తప్ప ఎవరికీ ఏమీ స్పస్టంగా తెలియదు. ఆయన అంతరంగికులు కొందరికి మాత్రమే కిమ్ గురించి తెలుసు.

3, అక్టోబర్ 2022, సోమవారం

Munugodu Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

Election Commission of India


మునుగోడు ఉపఎన్నిక నవంబరు 3న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

మహారాష్ట్ర, బిహార్, హరియాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో మొత్తం ఏడు సీట్లకు ఉపఎన్నికలను అదే రోజున నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

నోటిఫికేషన్: అక్టోబరు 7

నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 14

నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15

ఉపసంహరణ గడువు: అక్టోబర్ 17

పోలింగ్: నవంబర్ 3

ఓట్ల లెక్కింపు: నవంబర్ 6


16, మే 2021, ఆదివారం

Tauktae: కేరళను వణికిస్తున్న తౌక్టే తుపానుకు Myanmar Gecko తొండలకు సంబంధం ఏమిటి.. ఆ పేరెవరు పెట్టారు

cyclone Tauktae

తౌక్టే.. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను కేరళను కకావికలం చేస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు.

మల్లాపురం, కోళీకోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో తౌక్టే ప్రభావం తీవ్రంగా ఉంది.

దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తౌక్టే తుపాను గుజరాత్‌లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

తౌక్టే అంటే అర్థమేమిటి.. ఈ పేరెవరు పెట్టారు

తౌక్టే అనే పేరు మయన్మార్ పెట్టింది. బర్మా భాషలో తౌక్టే అంటే ఒక రకమైన చిన్న తొండ (Gecko) . ఈ రకం తొండలు చూడ్డానికి బాగా చిన్నగా ఉంటాయి కానీ పెద్ద శబ్దం చేస్తాయి.

తౌక్టే మగ తొండలు జత కూడే కాలంలో పెద్ద శబ్దం చేస్తూ ఆడ తొండలను ఆకర్షిస్తాయి.

తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు? ఎవరు నిర్ణయిస్తారు?

వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్... భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్న ఒక కూటమి కలిపి ఈ పేర్లను నిర్ణయిస్తాయి. 

కొన్ని పేర్లతో ఒక జాబితాను తయారుచేస్తాయి. 

2004లో ఇలా ఈ 8 దేశాలు ఒక్కో దేశం 8 చొప్పున పేర్లు నిర్ణయించి మొత్తం 64 పేర్లతో జాబితా రూపొందించాయి.

ఏటా వచ్చే తుపాన్లకు ఈ జాబితాలోని పేర్లను వరుసగా పెడుతుంటాయి.

2004లో రూపొందించిన జాబితాలోని 64 పేర్లలో చిట్టచివరి పేరు Amphan. 

అయితే, 2018లో వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్ మొదట ఉన్న 8 దేశాలకు కూటమిలో మరో 5 దేశాలను చేర్చింది. అవి ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.

వాటిని జోడించాక కూటమిలో మొత్తం 13 దేశలయ్యాయి.

దాంతో ప్రతి దేశం 13 చొప్పున 13 దేశాలు కలిపి 169 పేర్లతో కొత్త జాబితా రూపొందించారు.



తుపాన్లకు అసలు పేర్లెందుకు పెడతారు?

ఒక్కో సముద్రంలో జనించే తుపాన్ల విషయంలో కన్ఫ్యూజన్ తగ్గించడానికి ఇలా పేర్లు పెట్టడం ప్రారంభించారు. 

ప్రతి మహాసముద్ర పరిధిలో ఏర్పడే తుపాన్లకు అక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్లు పేర్లు పెడుతుంటాయి.

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ఉన్న రూల్సేమిటి?

* తుపాన్లకు పెట్టే పేర్లకు రాజకీయాలతో సంబంధం ఉండకూదు.

* ఏ ఒక్క జెండర్‌నో , ఏ ఒక్క కల్చర్‌నో, ఏ ఒక్క మతాన్నో సూచించేలా ఉండకూడదు. వీటన్నిటికీ అతీతమైన పదం అయ్యుండాలి.

* ఎవరి సెంటిమెంట్లను బాధపెట్టేలా ఉండకూడదు.

* తీవ్రమైన, క్రూరమైన పదజాలం కాకూడదు.

* చిన్న పదాలు, సులభంగా పలికేవి అయ్యుండాలి.

* ఇంగ్లిష్‌లో 8 అక్షరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.

ఇండియా పెట్టిన పేర్లేమిటి?

కొత్త జాబితాలో ఇండియా పెట్టిన పేర్లు కూడా 13 ఉన్నాయి.

Tej(తేజ్)

Murasu(మురసు)

Aag(ఆగ్)

Vyom(వ్యోమ్)

Jhar(ఝర్)

Probaho(ప్రొబాహో లేదా ప్రవాహ)

Neer(నీర్)

Prabhanjan(ప్రభంజన్)

Ghurni(ఘుర్ని)

Ambud(అంబుధ్)

Jaladhi(జలధి)

Vega(వేగ)