జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జెండా ఆవిష్కరించారు.
ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జెండా ఆవిష్కరించారు.
ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ అమిత్ షాను కోరారు.
ఈ మేరకు ఆయన వినతి పత్రం కూడా అందించారు.
‘‘విశాఖ ఉక్కు కర్మాగారం... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక. ఇటువంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమేనని జనసేన భావిస్తోంది’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
‘‘22 వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది పర్మినెంట్, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సుమారు లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఈ ప్లాంటు ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం అనేది జనసేన అభీష్టానికి వ్యతిరేకం. ఒకసారి ఈ కర్మాగారం చరిత్ర పుటలను తిరగేస్తే ఈ కర్మాగారం ఆవిర్భావం కోసం 32 మంది ప్రాణాలను వదిలారు. వందలాది మంది నిర్భందాలకు గురయ్యారు. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇంతటి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారందరికీ ఆమోదయోగ్యం కాని విషయమే. యు.పి.ఎ పక్షాన ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్ కు చెందిన మన్మోహన్ సింగ్ ముందుకు తీసుకెళ్లిన పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆ పరిధిలోకి చేరిన ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుంది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రత్యక్షంగా ఈ విజ్ఞాపనను తెలుగువారి పక్షాన ఆయన తెలియచేస్తారు’’ అని నాదెండ్ల చెప్పారు.
కాపులతోపాటు ఆర్థికంగా, సామాజకంగా అణగారిన అన్ని వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. 1930 నుంచే కాపు కులంలో విభజించు, పాలించు సిద్ధాంతం మొదలయ్యిదని, అది ఈ రోజుకీ కొనసాగుతుందన్నారు. కాపులకు రాజకీయ సాధికారిత వచ్చిన రోజు... మిగిలిన అన్ని వెనుకబడిన కులాలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు.
కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుత “కులం అనేది మనం ఎంచుకునేది కాదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రెల్లి కులంవారి అవస్థలు చూసి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉండాలని రెల్లి కులాన్ని స్వీకరించాను. పొలిటికల్, సోషల్ ఫిలాసఫీని సంపూర్ణంగా అధ్యయనం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఏదైనా మాట మాట్లాడితే కులం అంటగట్టేస్తారనే భయం నాకు లేదు. ప్రతి కులం ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొన్నప్పుడు.. నేను పుట్టిన కులం నా దగ్గరకు వచ్చి సమస్యలను విన్నవించుకోవడం తప్పేమి కాదు. దానికి కులం అంటగడతారనే భయం అవసరం లేదు. నా మనసు, ఆలోచన ప్రజలకు తెలుసు. నేను అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందివాడిని. ప్రతి కులంలో వెనకబాటు తనం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించను.
1891 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం కులాల ఆధారంగా జనాభా లెక్కలు మొదలు పెట్టడంతో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. రాజ్యాంగం ఏర్పడి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే వరకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు బీసీల్లోనే ఉండేవి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నీలం సంజీవరెడ్డి కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు. తర్వాత శ్రీ దామోదరం సంజీవయ్య గారు రిజర్వేషన్లు పునరుద్దరించారు. కాపులు దళితవర్గం నుంచి వచ్చిన గొప్ప నేత, ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలి. ఆ తరవాత కొన్ని రాజకీయ శక్తుల కుయుక్తుల వల్ల బీసీ రిజర్వేషన్ కొనసాగలేదు. ఈ సమయంలోనే కాపు కులంలో విభజించు, పాలించు అనే సిద్ధాంతం మొదలైంది. అది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. తూర్పు కాపులు, మున్నూరు కాపులు అని విడదీశారు. ఇప్పటికీ విడదీస్తూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎవరూ ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
చంద్రబాబు గారు కాపులు ఓసీలా, బీసీలా అనే మీమాంశలో పడేస్తే.. జగన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ముందుగా కాపుల్లో చలనం వచ్చి, మథనం జరిగితే తప్ప రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేము.
నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో రామ్ మనోహర్ లోహియా గారు ఒకరు. ఆయన్ను అపారంగా గౌరవిస్తాను. ఆయన రాసిన భారతదేశంలో కులాలు అనే పుస్తకం నన్ను బలంగా హత్తుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కులాలకు వెనకబాటుతనం, కాపుల గురించి ఆయన ప్రస్తవించిన విధానం, మిగతా కులాలను కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలని ఆయన చెప్పిన విధానం నన్ను లోతుగా అధ్యయనం చేసేలా చేసింది.
రాజకీయంగా శాసించే శక్తులు, చట్టాలను చేతుల్లోకి తీసుకున్న కొంతమంది వ్యక్తులు అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు. కాపులకు సాధికారిత వచ్చిన రోజున దళితులు, బీసీలు మిగత వెనుకబడిన కులాలకు వీళ్లందరి నుంచి విముక్తి లభిస్తుందని లోహియా గారు ఆ పుస్తకంలో రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ను అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం తీసేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, హరిరామ జోగయ్య వంటి కొంతమంది వ్యక్తులను చూసి ఆ కులానికి రిజర్వేషన్ అవసరం లేదనుకున్నారేమో? కాపు కులంలో 15 నుంచి 20 శాతం మందిని పక్కన పెడితే 80 శాతం మంది దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. కాపులు బలపడకూడదని తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా కొన్ని దశాబ్దాల కిందటే విడదీశారు. కాపు, ఒంటరి, బలిజ కులాల మధ్య తగదాలు పెట్టారు.
రాజకీయ శక్తులు నిరంతరంగా చేస్తున్న దాడులను అందరూ గుర్తించాలి. బలమైన ఐక్యత తీసుకొచ్చే ప్రక్రియ జరగాలి. ఏడు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న ఎందుకు వెనకబడిపోయామో కాపుల్లో ఆత్మపరిశీలన జరగాలి. రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకునే బలమైన సముహం ఉండి కూడా రాజ్యాధికారాన్ని శాసించే కొన్ని శక్తులకు ముడిసరకుగా ఉపయోగపడుతున్నాం.
అధికారం అనేది ఎవరూ మనకి పిలిచి ఇవ్వరూ. మనమే దానిని చేజిక్కుంచుకునే స్థితిలో ఉండాలి. టీటీడీ బోర్డులో కాపులకు స్థానం ఇవ్వలేదని హరిరామ జోగయ్య గారు తెలిపారు. హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు క్రమ పద్ధతిలో విధివిధానాలు ఉండాలి. తుని అంటే అందరికి రైలు దుర్ఘటనే గుర్తొస్తుంది. ఆ దుర్ఘటన వల్ల కాపుల సహేతుకమైన డిమాండ్ మరుగునపడిపోయింది. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. తుని రైలు దుర్ఘటనలో నమోదైన కేసులను జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కొట్టేసింది. అయితే తుని ఘటనకు సంఘీభావంగా వివిధ జిల్లాల్లో నిరసన తెలిపిన వారిపై ఇంకా కేసులు నడుస్తునే ఉన్నాయి. వాటిని కూడా ఎత్తేయాలి.
భారతదేశంలో కులాలను పక్కన పెట్టి రాజకీయం చేయలేము. కులాలను అర్ధం చేసుకొనే రాజకీయం చేయాలి. ఒక కులాన్ని భూజం మీద పెట్టుకొని ఊరేగే పరిస్థితి లేకుండా... ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించి వారిని అన్ని కులాలతో సమతుల్యం ఏర్పడేలా చేయాలి. కాపులు బలపేతం అవ్వడం అంటే బీసీలను బలహీనులను చేయడం కాదు. వారికి రావాల్సిన హక్కులను తిరిగి తెచ్చుకోవడం. కాపుల వెనుకబాటు తనం, అసంతృప్తిని మనస్ఫూర్తిగా అర్ధం చేసుకున్నవాడిగా చెబుతున్నాను... బీసీలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను బలంగా ముందుకు తీసుకెళ్తాన”ని హామీ ఇచ్చారు.
చిరంజీవి గారు జనసేనలోకి వస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నించగా శ్రీ పవన్ కల్యాణ్ గారు సమాధానమిస్తూ “అన్నయ్యగా చిరంజీవి గారు తమ్ముడు అభివృద్ధిని కోరుకొంటారు. అన్నయ్య గారి ఆశీస్సులు ఉంటాయి. పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను” అన్నారు.
కాపు సంక్షేమ సేన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు మాట్లాడుతూ “కాపు సంక్షేమ సేన ఏ పార్టీకి సంబంధించిన సంస్థ కాదు. మేము ఏ నాయకుడికీ అనుయాయులం కాదు. కాపుల అభ్యున్నతి కోసం, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేశాం. మా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాం. ముఖ్యమంత్రి గారికీ, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం. కేవలం ఒక్క జనసేన పార్టీకి మాత్రమే కుల ముద్ర ఎక్కడ పడుతుందోనన్న భయంతో ఇన్నాళ్లు దూరంగా ఉన్నాం. శ్రీ పవన్ కల్యాణ్ గారు కలగచేసుకుంటేనేగానీ డిమాండ్స్ సాధించలేమన్న నిర్ణయానికి వచ్చాం. కాపు ముద్ర పడినా పర్వాలేదు మాకు న్యాయం జరిగితే చాలు అన్న ఉద్దేశంతో మా సమస్యలు మీ దృష్టికి తీసుకువచ్చాం. మా డిమాండ్లు పరిశీలించి కాపులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతున్నాం.
ఒక పేద కులం, అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న కులం కోరికగా ప్రభుత్వం ముందు ఉంచండి. మేము ఇతర కులాల ప్రయోజనాలు కాపాడుతూ మాకు డిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడండి. మేము ఏ ఒక్క కులానికీ వ్యతిరేకం కాదు.
రాజకీయంగా సైతం కాపులను అణగదొక్కుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కనీసం ఒక్క కాపుకి కూడా అవకాశం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. కాపుల్ని కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడం మినహా ఎవ్వరూ మాకు ఉపయోగపడలేదు” అన్నారు. ఈ సమావేశంలో కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షులు డా.యిర్రింకి సూర్యారావు, కన్వీనర్ శ్రీ చందు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలకు అండగా నిలవడం అభినందనీయంగా ఉందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్ అందిస్తున్న సహకారంపై చర్చించారు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల నిర్వహణ, కోవిడ్ పరిస్థితుల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఆక్సిజన్ సిలెండర్ల వితరణ... ఇలా పలు కార్యక్రమాల్లో ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్ స్పందించి తమ వంతు తోడ్పాటునిచ్చింది. జనసేన పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ అధ్యక్షులకు తెలియచేస్తూ, ప్రకాశం జిల్లాలో అధికారపక్షం వేధింపులవల్ల ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబానికీ ఎన్నారై జనసేన టీమ్ అందించిన సహాయాన్ని వివరించారు. ఇందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎన్నారై జనసేన టీమ్ కు అభినందనలు తెలియచేశారు.
తిరుపతి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గురువారం అక్కడ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు.
తిరుపతి విమానాశ్రయంలో, తిరుపతి నగరంలో పవన్ కళ్యాణ్‌కు స్థానిక కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ చిత్రాలు..
‘‘ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబుని కోనపల్లిలో పారిశుధ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రహదారులు లేవు... ఇతర ఏ సౌకర్యాలు లేవని... ఎప్పుడు కల్పిస్తారని జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే రాంబాబు - 'నీ మెడలో పార్టీ కండువా తీయ్...' అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో రాష్ట్ర ప్రజలు చూశారు. ప్రశ్నించిన ఆ యువకుణ్ణి ప్రజల మధ్యనే బెదిరించిన ఎమ్మెల్యే- తదుపరి తన పార్టీ వ్యక్తుల ద్వారా బెదిరించడం, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది. ఈ రోజు శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిసి బాధకు లోనయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.
* ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
తమ గ్రామంలో సౌకర్యాల కోసం ప్రజల తరఫున గళమెత్తి ఎమ్మెల్యేను ప్రశ్నించడమే శ్రీ వెంగయ్య నాయుడు చేసిన తప్పా? అతను తన ఒక్కడి సౌకర్యం కోసం ప్రశ్నించలేదు... ఊళ్ళో ప్రజలందరి కోసం మాట్లాడాడు. ఆ గొంతు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టించింది. ఆ భయంతోనే శ్రీ వెంగయ్య నాయుడు గొంతు నొక్కే పని ఆ క్షణం నుంచే అధికార పక్షం మొదలుపెట్టింది. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. గ్రామంలో కనీస సౌకర్యాల గురించి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవలసిందేనా? ఇది వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. తన నియోజకవర్గ ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేనప్పుడు ఆ పదవిలో ఉండి ఏమి ఉపయోగమో సదరు ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శ్రీ వెంగయ్య నాయుడు మృతిపై సమగ్ర విచారణ చేయించాలి. అధికార పక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలి. అతన్ని బెదిరింపులకు గురి చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మన జీవనయానంలో తోడుగా ఉన్న పశుపక్ష్యాదులను సైతం పూజించడం హిందూ ధర్మంలో కనిపిస్తుంది. కనుమ పండుగ రోజున మన పాడి పంటలకు దోహదపడ్డ పశు సంపదను ఆరాధిస్తాం. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కనుమ వేడుకలను గోశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోశాలలో కనుమకు సంబంధించిన పూజలను చేపట్టారు. గోవులను అలంకరించి వాటికి ఫలాలు, ఇతర ఆహారం అందించి నమస్కరించారు. గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగం అని పవన్ కల్యాణ్ విశ్వసిస్తారు. ఆ క్రమంలోనే గోశాలలోని గో సంపదతోపాటు, వ్యవసాయ క్షేత్రంలోని ఇతర పశు సంపద, అక్కడకు చేరే పక్షుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.