దిల్లీ అల్లర్ల నేపథ్యంలో అక్కడి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇందిరాగాంధీ హత్య తరువాత 1984 సిక్కుల ఊచకోత నాటి పరిస్థితులు రానివ్వబోమని కోర్టు అన్నది. ఇంతకీ.. 1984లో ఏం జరిగింది.. ఇందిరాగాంధీ హత్య తరువాత దిల్లీలో సిక్కులను ఎవరు ఊచకోత కోశారు.. వేలాది మందిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో చూద్దాం..
1984, అక్టోబరు 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నవంబరు 1న సిక్కుల ఊచకోత మొదలైంది.
ఇందిర హత్య జరిగిన రోజే సిక్కులను లక్ష్యంగా చేసుకొని చాలా చోట్ల దాడులు జరిగినప్పటికీ, మొదటి హత్య మాత్రం మరుసటి రోజు, నవంబర్ 1న తెల్లవారుజామున జరిగింది.
నవంబర్ 1 ఉదయం, తూర్పు దిల్లీలో తొలుత ప్రారంభమైన హింసాకాండ హత్యకు దారితీసింది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇందిర హత్య జరిగిన తర్వాత చాలా సేపటికి సిక్కుల ఊచకోత మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మారణహోమంలో 2,733 మంది చనిపోయారు.
ఈ హింసాకాండ ఇందిర హత్య జరిగిన వెంటనే మొదలు కాలేదు కాబట్టి ఇది పథకం ప్రకారం సాగించిన హత్యాకాండ కాదని ప్రభుత్వం చేసే వాదన సత్యదూరమైంది.
1984 మారణకాండపై విచారణకు అనేక కమిటీలు, కమిషన్లు వేశారు. రెండు నెలల కిందట కూడా దీనిపై కొత్తగా మరో కమిటీ కూడా ఏర్పాటైంది.
1984 మారణహోమంపై సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) రెండేళ్లుగా విచారణ చేసినప్పటికీ 1984 మారణహోమానికి సంబంధించిన 200 కేసులను ఎందుకు మూసివేసిందో విచారించేందుకు ఈ ఏడాది ఆగస్టు 16న ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల్లో ఇది తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.
సిట్ ఇప్పటి వరకు 293 కేసులను పరిశీలించి అందులో కేవలం 59 కేసులను తిరిగి ప్రారంభించింది. అందులో కూడా మళ్లీ 39 కేసులను మూసివేసింది. కేవలం 4 కేసులలో లిఖితపూర్వక ఆధారాలు సేకరించింది.
1984లో దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో చెలరేగిన హింస సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్ అక్కడే ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి. ఆయన్ను చూసిన ప్రత్యక్ష సాక్షులూ ఉన్నారు. అందుకే ఈ విషయంలో తమకు కొంతైనా న్యాయం జరుగుతుందని, ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీకి శిక్ష పడుతుందని బాధితులు బలంగా నమ్మారు. ఈ విచారణలో బాధితుల తరఫున పోరాడేందుకు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా పంజాబ్ అంసెబ్లీ ప్రతిపక్ష హోదాను కూడా వదులుకున్నారు. 2018 చివర్లో సజ్జన్ కుమార్కు శిక్ష పడింది.
శిక్షలు పడకపోయినా 1984 ఊచకోత కేసులో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎందరో విచారణ ఎదుర్కొన్నారు. కేంద్రంలో మంత్రులుగా పనిచేసినవారు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు కూడా (1984 తరువాత) ఆ సమయంలో మూకలను రెచ్చగొడుతూ దిల్లీ వీధుల్లో తిరుగుతూ వేలాది మంది సిక్కుల మరణానికి కారణమయ్యారని అప్పటి ఘటనను గుర్తుచేసుుంటూ అప్పటివారు చెబుతారు.