జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.
ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు.
''ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది.
ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు'' అని ఒక ప్రకటనలో వెల్లడించారు.
''అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి ఆయన్ను పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.