పూర్తి పేరు: వల్లభ్‌భాయ్ జవేరీభాయ్ పటేల్
పుట్టిన తేదీ: 1875 అక్టోబరు 31
తల్లిదండ్రులు: లాడ్‌భాయి, జవేరీభాయ్.
జన్మస్థలం: నడియాద్, గుజరాత్
* 1893లో 18ఏళ్ల వయసులోనే జవేర్బాను పటేల్ పెళ్లి చేసుకున్నారు.
* 1901 నుంచి గోద్రా జిల్లా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
* 1903లో కుమార్తె మణిబెన్, 1905లో కుమారుడు దహ్యాభాయ్ జన్మించారు.
* 1910లో మిడిల్ టెంపుల్ వర్సిటీలో న్యాయవిద్య పై చదువులకు లండన్ వెళ్లారు.
* 1914లో క్రిమినల్ లాయరుగా అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు.
* 1915లో గుజరాత్ సభలో సభ్యుడిగా నియమితులయ్యారు. ముంబయిలో జరిగే భారత జాతీయ కాంగ్రెస్ సభలకు ప్రతినిధిగా ఎంపికయ్యారు.
* 1917 జనవరి 5న అహ్మదాబాద్ మున్సిపాలిటీలోని దరియాపూర్ వార్డు సభ్యుడిగా గెలిచారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం.ఈ ఎన్నికను కొందరు సవాలు చేయడంతో రద్దైంది. మే 14న మళ్లీ ఎన్నిక నిర్వహించగా తిరుగులేని విజయం సాధించారు.
* 1931లో భారత జాతీయ కాంగ్రెస్‌కు పోటీ ద్వారా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
* 1947లో దేశ విభజనపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పటేల్ విభజనకు అంగీకరించారు.
* 1950 డిసెంబరు 15న ముంబయిలో తుదిశ్వాస విడిచారు.
* 1991లో భారతరత్న వరించింది.
పట్టుదలకు మారుపేరు ఆయన.. అరువు తెచ్చుకున్న పుస్తకాలతో న్యాయవిద్య చదివి బారిస్టర్ ఎట్ లా పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన దీక్ష ఆయనది. ఎంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని, భోగభాగ్యాలను త్యజించి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగిన యోధుడాయన. సమైక్య భారత నిర్మాతగా, సుపరిపాలన ప్రణాళికలకు ఆద్యుడిగా నిలిచిన ఆ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్.
చిన్ననాటి నుంచి అదే పట్టుదల
ఉక్కుమనిషిగా గుర్తింపు పొందిన వల్లభాయ్ పటేల్‌ది దృఢ చిత్తం. ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించని తత్వం ఆయనది. పట్టుదల, సంకల్పబలం వల్లభ్‌భాయ్‌కు చిన్ననాడే ఒంటబట్టాయి. న్యాయవాద విద్యలో బారిస్టర్ కావాలన్నది పటేల్ కల. అది నెరవేరాలంటే ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ ఎట్ లా చదవాలి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పటేల్‌కు ఆ ఖర్చును తట్టుకోవడం సాధ్యం కాని పని. కానీ ఆయన పట్టు వదల్లేదు. న్యాయవిద్య చదువుతున్న స్నేహితుడి దగ్గర పుస్తకాలు అరువు తెచ్చుకుని చదువుకున్నారు. నిత్యం కోర్టుకు వెళ్లి న్యాయవాదులు ఎలా వాదిస్తారో చూసి తెలుసుకున్నారు. అలా న్యాయ విద్యను అభ్యసించి గుజరాత్‌లోని గోద్రాలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.అన్న కోసం త్యాగం
బారిస్టర్ చదవడానికి సరిపడా డబ్బు సంపాదించారు. కానీ వెంటనే ఇంగ్లాండ్ వెళ్లిపోలేదు. బారిస్టర్ కావాలని కలలుగన్న తన అన్న విఠల్‌భాయ్ పటేల్‌ను ముందు ఇంగ్లాండ్ పంపించారు. ఆయన బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని వచ్చాకే వల్లభ్‌భాయ్ పటేల్ ఇంగ్లాండ్ బయల్దేరారు. బారిస్టర్ ఎట్ లా పరీక్షలో ప్రథముడిగా నిలిచి తన కల నిజం చేసుకున్నారు.గాంధీని కలిశాక మారిన దారి
ఎంతో ఇష్టపడి, చిన్ననాటి నుంచి లక్ష్యంగా పెట్టుకుని బారిస్టర్ చదివిన పటేల్ న్యాయవాద వృత్తిలో విశేషంగా రాణిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీని కలిశారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ సాగిస్తున్న అహింసాయుత పోరాటంతో స్ఫూర్తి పొందారు. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తానూ సంగ్రామంలోకి దూకారు.మహిళలు ఇచ్చిన బిరుదు సర్దార్
1918లో బ్రిటిష్ ప్రభుత్వం గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో భూమిశిస్తును భారీగా పెంచింది. పన్ను తగ్గించేవరకు సహాయ నిరాకరణ చేయాలని గాంధీజీ ప్రజలకు సూచించారు. ఈ ఉద్యమాన్ని నడిపే బాధ్యతను పటేల్ భుజస్కంధాలపై పెట్టారు. రైతులను, ముఖ్యంగా రైతు మహిళలను ఏకం చేసి పటేల్ పోరాడారు. ‘ఈ ఉద్యమంలో మనకెన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆస్తులు జప్తు చేయొచ్చు. కానీ మనం వెనక్కి తగ్గొద్దు. మన పోరాటమే మనకు శ్రీరామరక్ష’ అని వారిలో ధైర్యం నూరిపోశారు. రైతుల సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్ధృతికి బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గింది. పన్నుల పెంపును రద్దు చేసింది. దీంతో ఉద్యమ సారథిగా పటేల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అప్పుడే ఆ ప్రాంత మహిళలు సర్దార్ అని పటేల్‌కు బిరుదునిచ్చారు. అదే తర్వాత ఆయనకు ఇంటిపేరయింది. తర్వాత బర్దోలీ ఉద్యమాన్నీ పటేల్ ముందుండి నడిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి