31, డిసెంబర్ 2022, శనివారం

New Year జనవరి 1నే ఎందుకు ప్రారంభమవుతుంది.. వేడుకలు ఈ తేదీనే ఎందుకు జరుపుకొంటారు?

2023 Happy New year

ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే 2070 సంవత్సరాల వెనక్కు వెళ్లాలి. క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్.. జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.

సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం కొన్నిసార్లు లీప్ డే ఒకదానిని యాడ్ చేస్తాం. భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. కాబట్టే రోజూ ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంటాయి. 

అయితే, క్యాలండర్‌లో ఏ రోజుతో సంవత్సరం ప్రారంభించాలి అనే విషయంలో  సీజర్ ఆలోచించారు. 

రోమన్లకు జనవరి నెల ఇంపార్టెంట్. వారి దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది.

యూరప్‌లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువగా ఉండేది కూడా ఈ నెలలోనే.

అందుకే ఆయన జనవరితో క్యాలండర్ ప్రారంభించాలని నిర్ణయించారు. 

రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఆయా ప్రాంతాలకు చేరింది.

అయితే, పాశ్చాత్యంలో 5వ శతాబ్ధంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికారం చెలాయించింది.

అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు.

Happy New year 2023


క్రిస్టియన్ దేశాలు మార్చి 25తో మొదలుపెట్టాలని కోరుకున్నాయి..

చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి. దేవదూత గాబ్రియెల్.. మేరీకి కనిపించిన తేదీగా మార్చి 25కి  ప్రాశస్త్యం ఉంది.

క్రీస్తు జన్మించిన రోజు క్రిస్మస్. అయితే, దేవుని నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నావంటూ మేరీకి క్రీస్తు జననం గురించి చెప్పింది మాత్రం మార్చిలో. అప్పటి నుంచే క్రీస్తు కథ ప్రారంభమవుతుంది. మరెన్నో కారణాలతో పాటు మార్చి 25వ తేదీ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం కావాలనటానికి ఇది కూడా ఒక కారణం.

పోప్ 13వ గ్రెగరీ 16వ శతాబ్ధంలో గ్రెగరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.

క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.

అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది.

అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, యూరప్‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది.

ఇక వర్తమానంలోకి వస్తే.. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి.

అందుకే మనం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలను జరుపుకొంటున్నాం.


26, డిసెంబర్ 2022, సోమవారం

జీ20.. మోదీ తన ముద్ర చూపిస్తారా

Modi in G20


జీ20.. కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఇదే మాట. 

మామూలుగా అయితే జీ 7, జీ 10, జీ 15, జీ 20 వంటి వాటిపై సాధారణ ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. 

కానీ, ఈ సారి జీ20 సమావేశాల గురించి ఎన్నడూ లేనట్లుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మీడియాలోనూ విపరీతమైన కవరేజ్ కనిపించింది. 

జీ 20 సమావేశాలకు మోదీ వెళ్లడం నుంచి.. ఆయన్ను అమెరికా అధ్యక్షుడు పలకరించడం, ‘యుద్ధాలు చేసే కాలం కాదు ఇది’ అని మోదీ అంటే ప్రపంచ నాయకులంతా శభాష్ అనడం... చైనా అధ్యక్షుడు కనిపించగానే మోదీ కుర్చీలోంచి లేచి మరీ పలకరించడం... ఒకటా రెండా ప్రతిదీ పెద్ద విషయంగా ఇండియన్ మీడియాలో వార్తలొచ్చాయి. సామాన్యులూ అదే స్థాయిలో చర్చించుకున్నారు. 

ఇదంతా ఇండోనేసియాలోని బాలీలో జరిగిన జీ 20 సమావేశాల సంగతి.. ఇక అక్కడ నుంచి సీన్ ఇండియాకు మారిపోయింది. 2022లో ఇండోనేసియా నేతృత్వంలో జీ20 సమావేశాలు జరగ్గా వచ్చే సమావేశాలు భారత్ నాయకత్వంలో జరగబోతున్నాయి. 

రొటేషన్‌లో భాగంగా 2023లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇండోనేసియాలో జీ20 సమావేశాల ముగింపులో ఆ బాధ్యతలు మోదీకి అప్పగించారు. 

దాని ప్రకారం... 2022 డిసెంబర్ 1 నుంచే భారత్ అధ్యక్షత(ప్రెసిడెన్సీ) మొదలైపోయింది. తదుపరి సమావేశాలు 2023 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగబోతున్నాయి. 

2024 సమావేశాలకు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల్లో భారత్‌, మోదీ స్థాయి ఇటీవల కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహణ విషయంలో మోదీపై ప్రపంచ దేశాల్లో భారీ అంచనాలున్నాయి. 

ఈ సదస్సులో ఆయన ముద్ర కనిపిస్తుందని భావిస్తున్నారు.

Modi G20


ఇంతకీ ఏమిటీ జీ20?

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. 

ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 85 శాతం వాటా ఈ 20 మంది సభ్యులదే. 

ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఈ 20 దేశాలలోనే ఉంటారు.

ఈ జీ20 బృందానికి తనకంటూ శాశ్వత సిబ్బంది ఎవరూ ఉండరు. కాబట్టి ఈ బృందంలోని ఒక దేశం తమ ప్రాంతం వంతు వచ్చినపుడు సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది.

తదుపరి శిఖరాగ్ర సదస్సును.. ఆ సదస్సు కంటే ముందు నిర్వహించాల్సిన అనేక సమావేశాలను నిర్వహించే బాధ్యతను ఆ దేశం తీసుకుంటుంది. ప్రస్తుతం భారత్ ఇదే పనిలో ఉంది.

జీ-20 సభ్యులు కాని దేశాలను ఈ శిఖరాగ్రానికి అతిథులుగా ఆహ్వానించటానికి, అటువంటి దేశాలను ఎంపిక చేయటానికి ఈ దేశానికి వీలుంటుంది. అలా స్పెయిన్‌ను ఎల్లప్పుడూ ఈ భేటీకి ఆహ్వానిస్తుంటారు.

జీ20 సభ్య దేశాలు ఏవి?

గ్రూప్ ఆఫ్ 20(జీ20)లో 20 సభ్య దేశాలున్నాయి. 

అవి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్. 

ఇందులో 19 దేశాలు కాగా 20వది యూరప్ దేశాల సమాఖ్య.

మరో 9 దేశాలను ఆహ్వానించిన భారత్

ఈ దేశాల అధిపతులతో పాటు మరో 9 దేశాల నేతలనూ భారత్ ఈ సమావేశాలకు ఆహ్వానించింది.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా సయీద్ హుసేన్, మారిషన్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్, నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ, ఒమన్ రాజ్యాధిపతి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, సింగపూర్ ప్రధాని లీ సేన్ లూంగ్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బమబిన్ జయీద్ అల్ నహ్యాన్‌లను ఆహ్వానించారు. 

స్పెయిన్‌‌ను సాధారణంగా  ప్రతి జీ20 సమావేశాలకూ ఆహ్వానిస్తుంటారు.

మొట్టమొదటి సమావేశం 1999లో

ఆసియాలో ఏర్పడిన  ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో చాలా దేశాల మీద ప్రభావం చూపిన పరిస్థితుల్లో 1999లో జీ-20 ఏర్పాటైంది. మొదట 7 దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌లతో ఏర్పాటైంది. 1997-98 నాటి ఆర్థిక సంక్షోభం, అనంతర పరిణామల నేపథ్యంలో ఈ దేశాలన్నీ ఏకమై చర్చించుకున్నాయి.

గ్రూప్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు సమావేశమైన అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య అంశాలు చర్చించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.  ఈ గ్రూప్ తొలి శిఖరాగ్ర సమావేశమూ అదే ఏడాది బెర్లిన్‌లో జరిగింది.

మొదట్లో ఈ జీ-20 సదస్సుకు ప్రధానంగా ఆయా దేశాల ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు. కానీ 2007లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో అది మారిపోయింది. బ్యాంకులు కుప్పకూలటం, నిరుద్యోగం పెరగటం, వేతనాల్లో మాంద్యం నెలకొనటం వంటి పరిణామాలతో 2008 నుంచి జీ20 ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారిపోయింది.

ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షులు/ప్రధానమంత్రులు తప్పనిసరిగా హాజరవుతున్నారు.

జీ20 ఎలా పనిచేస్తుంది

జీ20 అజెండాను ముందుకు నడిపించేలా శిఖరాగ్ర సమావేశాలకు ముందు ఏడాది పాటు ఆతిథ్య దేశం వివిధ సమావేశాలు నిర్వహిస్తుంటుంది. 

ఇందులో భాగంగా రెండు రకాల సమావేశాలను సమాంతరంగా నిర్వహిస్తుంటుంది. వీటినే ఫైనాన్షియల్ ట్రాక్ మీటింగ్స్, షెర్పా ట్రాక్ మీటింగ్స్ అంటారు. 

జీ20 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్ల నేతృత్వంలో జరిగేవి ఫైనాన్షియల్ ట్రాక్ మీటింగ్స్. 

ఇక షెర్పా ట్రాక్ సమావేశాలంటే సభ్యదేశాల అధినేతల ప్రతినిధులు పాల్గొనే, వారి నాయకత్వంలో జరిగే సమావేశాలు. ఏడాది పాటు 20 సభ్య దేశాల అధ్యక్షులో, ప్రధానులో నిరంతరం ఈ సమావేశాలకు రానవసరం లేకుండా వారి ప్రతినిధులు(షెర్పా) హాజరవుతూ తమ దేశాల అభిప్రాయాన్ని, అజెండాను, అభ్యంతరాలను అన్నీ అక్కడ తెలియజేస్తారు. 

అవసరమైన ఒప్పందాలు ఏవైనా ఉంటే వాటిపై సంతకాలూ వారే చేస్తారు. 

సమావేశాల సబ్జెక్ట్ బట్టి దేశాలకు ప్రాతినిధ్యం వహించే షెర్పాలు మారొచ్చు. 

భారత్ తరఫున షెర్పాగా అమితాబ్ కాంత్ వ్యవహరిస్తున్నారు.

ఫైనాన్స్ ట్రాక్ కాన్ఫరెన్సులలో ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ల స్థాయిలో లక్ష్యాలు, ముఖ్యోద్దేశాల వారీగా చర్చలు జరుగుతాయి. 

షెర్పా ట్రాక్ కాన్ఫరెన్సులలో నెగోషియేషన్స్, అగ్రిమెంట్స్ వంటివి ఉంటాయి. 

ఈ రెండు రకాల సమావేశాలతో పాటు పౌర సమాజంలోనివారు, ఎంపీలు, థింక్ ట్యాంక్స్, మహిళలు, యువత, కార్మికులు, వ్యాపారవేత్తలు, అధ్యయనకర్తలతో ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశాలు జరుగుతుంటాయి. 

వర్కింగ్ గ్రూప్స్‌లో యునైటెడ్ నేషన్స్, ఐఎంఎఫ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ వంటి సంస్థలూ ఉంటాయి.

2023 దిల్లీ సమావేశాల ఉద్దేశం ఏమిటి

దిల్లీ సమావేశాల థీమ్ ‘వసుధైవ కుటుంబం’. దీన్నే ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’గా అంతర్జాతీయ సమాజానికి చెబుతున్నారు. 

మనుషులొక్కరే కాదు ఈ భూమి మీద జంతువులు, మొక్కలు, చివరికి సూక్ష్మజీవుల ప్రాణాలకూ విలువ ఇవ్వాలనేది ముఖ్యోద్దేశం. 

దీనికి అనుగుణంగానే పర్యావరణ సుస్థిరతకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే జీవనశైలిని వ్యక్తిగత స్థాయిలో, సామాజిక స్థాయిలో, జాతీయ విధాన స్థాయిలో రూపొందించుకోవడం, ఆచరించడం లక్ష్యంగా చర్చలు సాగుతాయి. 

పర్యావరణ సుస్థిరత సాధించే దిశగా ప్రపంచంలో మార్పులు తీసుకొస్తూ స్వచ్ఛమైన హరిత భవితను నిర్మించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు ఉంటుంది.

శిఖరాగ్రానికి ముందు సన్నాహక సమావేశాలు ఏవి, ఎప్పుడు, ఎక్కడ జరుగుతున్నాయి?

భారత్ అధ్యక్షతన జీ20కి సంబంధించిన సన్నాహక సమావేశాలు ఇప్పటికే మొదలైపోయాయి. 

ఈ సమావేశాలు జరగడానికి ముందు దేశంలోని అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. 

అనంతరం డిసెంబర్ 13 నుంచి 15 వరకు బెంగళూరులో ఫైనాన్షియల్ ట్రాక్ సమావేశాలు మొదలయ్యాయి. షెర్పా ట్రాక్ సమావేశాలూ మొదలయ్యాయి. 

తెలుగు రాష్ట్రాలలో లేని సమావేశాలు

బెంగళూరు, చండీగఢ్, చెన్నై, గౌహతి, ఇండోర్, జోధ్‌పూర్, ఖజురాహో, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె, రాణ్ ఆఫ్ కచ్, సూరత్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్ నగరాల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు కొన్ని సమావేశాలు వర్చువల్‌గా జరగనున్నాయి. 

తెలుగు రాష్ట్రాలలోని ఏ నగరంలోనూ ఈ సన్నాహక సమావేశాలను నిర్వహించడం లేదు.

లోగోపై వివాదం

భారత్ నిర్వహించే జీ20 సదస్సు లోగోలో కమలం ఉండడంపై విమర్శలు వచ్చాయి. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది. 

ఈ లోగోపై మోదీ స్పందిస్తూ.. ‘జీ20 లోగో కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు. ఇది ఒక సందేశం. ఇది ఒక భావోద్వేగం. మన నరనరాల్లో ఇది జీర్ణించుకుపోయింది. మన ఆలోచనల్లో భాగమైన తీర్మానం ఇది. ఈ లోగో, థీమ్ ద్వారా మనం ప్రపంచానికి సందేశం ఇస్తున్నాం’’అని చెప్పారు. అంతేకాదు.. కమలాన్ని ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా మోదీ అభివర్ణించారు. కమలాన్ని ఆకాంక్షకు చిహ్నంగా మోదీ చెప్పారు. ‘‘నేడు కోవిడ్-19 దుష్ప్రభావాలను ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయి. ఒకవైపు ఘర్షణలు, మరోవైపు ఆర్థిక మందగమనం అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో కొత్త ఆశలను ఈ జీ20 లోగో చిగురింపచేస్తోంది’’ అని ఆయన సమర్థించుకున్నారు. మరోవైపు విపక్షాలు దీన్ని బీజేపీ ఎన్నికల గుర్తు అంటుంటే బీజేపీ నేతలు మాత్రం భారతదేశ జాతీయ పుష్పం అని చెప్తున్నారు.

కశ్మీర్‌లో నిర్వహించాలనుకుని దిల్లీ..

జీ20 సమావేశాల వేదిక విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. 

తొలుత ఈ సదస్సును కశ్మీర్‌లో నిర్వహించాలనుకుంది. 

ఇందుకోసం అయిదుగురు సభ్యులతో ఒక కమిటీ కూడా వేశారు. 

కానీ, పాకిస్తాన్, చైనా, తుర్కియే, సౌదీ అరేబియా నుంచి అభ్యంతరాలు రావడంతో దిల్లీకి మార్చారు.

ప్రపంచమంతా కష్టాల్లో ఉన్న సమయంలో భారత్‌పై బాధ్యత

ప్రపంచంలోని అనేక దేశాలు ద్రవ్యోల్బణం, మాంద్యం ఎదుర్కొంటున్న తరుణంలో... రష్యా, యుక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో, రష్యా-యూరోపియన్ యూనియన్ మధ్య దూరం పెరిగిన తరుణంలో... స్వయంగా తాను కూడా చైనాతో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ శిఖరాగ్ర సమావేశపు పగ్గాలు తీసుకుంది. 

వచ్చే సమావేశాలలో ఇవన్నీ కీలకంగా చర్చకు రానున్నాయి. 

అయితే... మొన్నటి బాలీ సమావేశాలలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ సుహృద్భావంగా కనిపించడంతో రానున్న సమావేశాలపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. 

అయితే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టర్లో గల్వాన్ తరహాలో భారత్, చైనా సైనికులు వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు దిగారు. 

ఇలాంటి ఉద్రిక్తతలు మరింత పెరిగితే వచ్చే సమావేశాల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాలి.