29, సెప్టెంబర్ 2019, ఆదివారం

మోదీ, ఇమ్రాన్: ఐక్యరాజ్య సమితిలో ఎవరి ప్రసంగం బాగుంది?



మోదీ, ఇమ్రాన్ ఖాన్‌లు భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధాన మంత్రుల హోదాలో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశాల్లో(యూఎన్‌జీఏ) రెండు రోజుల కిందట ప్రసంగించారు. వారి ప్రసంగాలను ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా చూశాయి. అందుకు కారణం రెండు దేశాల మధ్య ఉన్న చిరకాల శత్రుత్వమే కాదు, తాజాగా తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కూడా.  భారతదేశంలోని జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని సవరించడం.. ఆ రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ప్రధాని మోదీ తనకంటే ముందు ఏడు దశాబ్దాలుగా దేశాన్ని ఏలినవారు చేయలేని పనిని చేశారు. ఆయన సాహసోపేత నిర్ణయంపై జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా దేశమంతా దాదాపుగా మద్దతు లభించింది. అంతేకాదు.. అంతర్జాతీయంగానూ ఆమోదం లభించింది. పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమైన ఈ నిర్ణయంపై తనకు సంబంధం లేనప్పటికీ పాక్ గొంతు చించుకుంటోంది. పాక్ అండతో ఇంతకాలం విర్రవీగిన ఉగ్రశక్తులూ దీనిపై రాద్ధాంతం సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజం భారత్ నిర్ణయాన్ని పూర్తిగా అంతర్గత విషయంగానే గుర్తించింది. పాక్‌కు అడ్డగోలుగా కొమ్ముకాసే దేశాలు సైత ఈ విషయంలో భారత్‌కు లభించిన అంతర్జాతీయ మద్దతు చూసి మౌనం వహించాయి. ఇలాంటి సమయంలో ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ, ఇమ్రాన్‌లు మాట్లాడడంతో వారేం మాట్లాడారన్నది, ఎవరు విజయవంతమయ్యారన్నది ప్రపంచానికి ఆసక్తిగా మారింది.

మోదీ ఫోకస్ ఒకటే...

మోదీ తన ప్రసంగంలో ప్రపంచ శాంతి, ఉగ్రవాదంతో పొంచివున్న సవాళ్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వాటినే ప్రస్తావించారు. పాకిస్తాన్ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించకుండానే ప్రపంచానికి మొత్తం తాను చెప్పాలనుకున్నది చెప్పగలిగారు. అంతేకాదు.. వర్ధమాన దేశంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచ నాయకుల ముందు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలో ఇంకే నాయకుడూ సాధించనంత మెజారిటీ సాధించి తాను విజయం సాధించానన్న విషయాన్ని ఐరాస వేదికగా అందరికీ గుర్తుచేశారు. దాంతో ప్రపంచ రాజకీయాల్లో  తానెంత కీలకమో చెప్పకనే చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ తీరు ఇలా..

మోదీకి భిన్నంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం సాగింది. ఆయన తన తొలి మాట నుంచే భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ లేవనెత్తారు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరిగితే సంభవించే నష్టాలపై మాట్లాడి ప్రపంచాన్ని భయపెట్టాలని చూశారు.


మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు..

మోదీ అసలు పాకిస్తాన్ గురించి ఏమాత్రం కూడా ప్రస్తావించలేదు ఎందుకు? కశ్మీర్‌పైనా ఎందుకు మాట్లాడలేదు? కేవలం అంతర్జాతీయ అంశాలు, తమ ప్రభుత్వ విజయాలు వంటివే ఎందుకు మాట్లాడారన్నది చూస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. ఆయన కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశం కాదు.. పూర్తిగా భారత అంతర్గత అంశం అన్నది ప్రపంచానికి చెప్పడానికే దాని గురించి మాట్లాడలేదని అర్థమవుతుంది. అంతేకాదు.. భారత్‌లో గత నేతల్లా కాకుండా తాను ప్రపంచ స్థాయి నాయకుడినన్న సంకేతాలు ఇచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.

మోదీ మూడు, నాలుగు ప్రధాన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌ అని ప్రపంచానికి గుర్తుచేయడం వీటిలో మొదటిది. మోదీ, ఆయన పార్టీ ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఓట్లతో ఎన్నికైన రాజకీయ నాయకుడు తనేనని ఆయన సంకేతాలిచ్చారు. పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి? వాతావరణ మార్పులను ఎలా అడ్డుకోవాలి లాంటి ప్రశ్నలకు ప్రపంచానికి భారత్ సమాధానాలు చూపించాలని అనుకుంటున్నట్లు మోదీ చెప్పారు. ఈ అంశాలు కూడా ప్రపంచంలోని అగ్రదేశాలు నిత్యం చర్చించే అంశాలే.
భారత్ అభివృద్ధి పథంలో వెళ్తోందని చెప్పేందుకు తమ ప్రభుత్వ విధానాలను ఉదహరించారు. అయితే కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా వినిపిస్తున్న వాదనలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షల గురించీ మోదీ మాట్లాడలేదు. భారత్ విషయంలో లేవనెత్తిన ఇతర ప్రశ్నల గురించి ఆయన స్పందించలేదు. సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి పరిరక్షణలతోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చి ప్రపంచానికి ఉగ్రవాదం ఎంతముప్పన్నది చర్చకు తెచ్చారు.

సర్వప్రతినిధి సభలో లోతైన అంశాలపై చర్చలు జరుగుతాయి. ఫ్రాన్స్, చైనా, రష్యా నాయకుల వాదనలను ఇక్కడ వినాలని ప్రపంచ నాయకులు భావిస్తుంటారు. ఈసారి భారత్ మాటలను కూడా ప్రపంచం వినేలా చేశారు మోదీ. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, పర్యావరణ మార్పుల కట్టడిలో భాగస్వామ్యానికి భిన్న స్థాయిల్లో కృషి అనేది సర్వప్రతినిధి సభ 74వ సమావేశాల థీమ్. పూర్తిగా ఆ థీమ్‌కు అనుగుణంగా మాట్లాడి మోదీ అందరినీ ఆకట్టుకున్నారు.

ఇమ్రాన్ విఫలం

మోదీకి పూర్తి విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపైనే దృష్టి కేంద్రీకరించారు.. ఐరాస సర్వసభ్య సమావేశం థీమ్ ఏమిటి? తానేం మాట్లాడుతున్నానన్నది లేకుండా ఆయన భారత్‌పై ఐరాస వేదికగా రాళ్ల వర్షం కురిపించారు.
కశ్మీర్‌ అంశాన్ని ఇమ్రాన్ ప్రస్తావించినా కొత్తగా ప్రపంచానికి ఏమీ చెప్పలేకపోయారు. పాతపాటే మళ్లీ పాడారు.
ఇదే సమయంలో ఆయన ప్రపంచాన్ని భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి భారత్‌పై వారు ఒత్తిడి చేసేలా చేయాలని ప్రయత్నించారు. ఒక దేశాధినేతలా, రాజకీయవేత్తలా కాకుండా తన మునుపటి రూపమైన క్రికెట్ ఆటలోని బౌలర్‌‌లా వ్యవహరించారు. బౌన్సర్లు, బాడీ లైన్ బౌలింగ్‌తో భయపెట్టాలని చూశారు. క్రికెట్‌లో అంపైర్లు ముందు పదేపదే అప్పీల్ చేసి ఒత్తిడి చేసినట్లు అంపైర్ల‌లాంటి ప్రపంచ దేశాల ముందు పదేపదే కశ్మీర్ గురించి మాట్లాడారు. కానీ, అంపైర్లేమీ ఆయన ఒత్తిళ్లకు తలొగ్గలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఐరాస వేదికగా ఇమ్రాన్ దారుణంగా విఫలమయ్యారనే చెప్పాలి.  కశ్మీర్‌లో కర్ఫ్యూను ఎత్తివేయాలని ఆయన అడిగారు.. భారత్‌లోని ప్రతిపక్ష నేతలా ఆయన వ్యవహరించారే కానీ పాకిస్తాన్ ప్రధానిలా ఆయన మాట్లాడలేదన్న విమర్శలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్‌లో ఎన్నికల సమయంలో ప్రచార ర్యాలీలలో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజల ఆవేశాన్ని రెచ్చగొట్టి ఓట్లు సాధించేందుకు ఆయన ప్రయత్నించినట్లుగానే కనిపించింది కానీ ఐరాసలో మాట్లాడుతున్నట్లుగా లేదు.
అంత సుదీర్ఘంగా మాట్లాడిన ఇమ్రాన్ సమావేశాల అసలు ఉద్దేశానికి సంబంధించి మాట్లాడింది చాలా తక్కువ. ఆయన ప్రసంగంపై పాకిస్తాన్‌లోనే ఎవరికీ సంతృప్తి కలగలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి